ఓఆర్‌ఆర్ నుండి జనార్ధన్‌రెడ్డి (శిల్పా లేఔట్-ఫేస్) వరకు నిర్మాణం
ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం
నగరవాసులకు తప్పనున్న ట్రాఫిక్ ఇబ్బందులు
హైదరాబాద్, జూన్ 27: ఔటర్ రింగ్ రోడ్డు నుండి కొండాపూర్ వరకు నిర్మించిన పీజేఆర్ ఫ్లై ఓవర్ శనివారం నుంచి నగరవాసులకు అందుబాటులోకి రానుంది. ఇది అందుబాటులోకి వస్తే హైదరాబాద్ ప్రజలకు, ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో ప్రయాణించే వారికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఔటర్ రింగ్ రోడ్ నుండి కొండాపూర్ వరకు నిర్మించిన ఈ అత్యాధునిక మల్టీ-లెవల్ ఫ్లైఓవర్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం ప్రారంబించనున్నారు. ఈ ఫ్లైఓవర్ వల్ల గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గడమేగాక ప్రయాణ సమయం కూడా ఆదా అవుతుంది.
ప్రాజెక్ట్ వివరాలు
ఈ ఫ్లైఓవర్‌ను వ్యూహాత్మక రహదారి అభివృద్ధి కార్యక్రమం కింద రూ.182.72 కోట్లతో నిర్మించారు. ఇది 1.2 కి.మీ పొడవు, 24 మీటర్ల వెడల్పుతో ఆరు లేన్‌లతో ఉంటుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది ఇప్పటికే ఉన్న రెండు ఫ్లైఓవర్లపై నిర్మించిన మూడవస్థాయి నిర్మాణం. కింద గచ్చిబౌలి జంక్షన్ ఫ్లైఓవర్ ఉంది, దానిపైన శిల్పా లేఅవుట్ ఫేజ్ 1 ఫ్లైఓవర్ ఉంది మరియు ఇప్పుడు దాని పైన ఫేజ్ 2 ఫ్లైఓవర్ నిర్మించబడిరది.
ట్రాఫిక్ కష్టాలు మాయం
ఈ ఫ్లైఓవర్ గచ్చిబౌలి జంక్షన్ వద్ద తీవ్రమైన ట్రాఫిక్ సమస్యను చాలావరకు తగ్గిస్తుంది. ఓఆర్‌ఆర్ నుండి కొండాపూర్, హఫీజ్‌పేట్ మార్గాలకు వెళ్లే వాహనదారులకు ఇది చాలా అనుకూలం. హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు మెరుగైన కనెక్టివిటీని అందిస్తుంది. ప్రయాణ సమయాన్ని ఆదా చేయడంతో పాటు గంటలతరబడి ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా చేరవలసిన గమ్యస్థానాలను వేగంగా చేరుకోవచ్చు. కొండాపూర్ ప్రాంతం నుండి శంషాబాద్ విమానాశ్రయం అక్కడినుండి కొండాపూర్ ప్రాంతాలకు గచ్చిబౌలి వద్ద ఎలాంటి ట్రాఫిక్ జామ్‌లు లేకుండా నేరుగా చేరుకోవచ్చు. ఈ ఫ్లైఓవర్ ప్రారంభం హైదరాబాద్ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఒక ముఖ్యమైన అడుగు అవుతుంది.
హెచ్ సిటీ
హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మౌలిక సదుపాయాలకు పెద్ద పీట వేశారు. గతంలో జీహెచ్‌ఎంసీకి ఇచ్చిన హామీ ప్రకారం నగర అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయి. జీహెచ్‌ఎంసీ ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం పొందుతోంది. ప్రజా పాలన ప్రభుత్వం నగర అభివృద్ధి కోసం రూ.7032 కోట్లతో హెచ్ సిటీ ద్వారా 58 పనులను చేపట్టనుంది. వీటిలో 28 ఫ్లైఓవర్లు, 13 అండర్‌పాస్‌లు, 4 ఆర్వోబీలు, 3 రైల్వే అండర్‌బ్రిడ్జిలు, 10 రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని ప్రతిపాదించారు. ఈ పనులు టెండర్ దశ పూర్తయి ఒప్పంద దశలో ఉన్నాయి. వీటిలో కొన్ని త్వరలో ప్రారంభం కానున్నాయి.





