– నిర్వహణ లేక కళ తప్పిన మున్సిపాలిటీలు
– కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు ఇవ్వడంలేదు
– మున్సిపాలిటీల్లో పడకేసిన పారిశుద్ధ్యం
– మాజీ మంత్రి హరీష్‌రావు విమర్శ
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 12: మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని మొత్తం 17 మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేయాలని మాజీ మంత్రి హరీష్ రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ వేదికగా ఉమ్మడి మెదక్ జిల్లా మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం హరీష్ రావు అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాణిక్యరావు, సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, శంభీపూర్ రాజుతోపాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, 17 మున్సిపాలిటీలకు సంబంధించిన ఇన్చార్జీలు, ముఖ్య నాయకులు హాజరయ్యారు.ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. పల్లెల నుంచి పట్నాల దాకా అంతా అస్తవ్యస్తమే. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పట్టణ ప్రగతితో దేశానికి ఆదర్శంగా నిలిచిన మన మున్సిపాలిటీలు నేడు నిర్వహణ లేక కళ తప్పాయి. కనీసం వీధి లైట్లు వేయలేని, మురికి కాలువలు శుభ్రం చేయలేని దయనీయ స్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా మున్సిపాలిటీల రూపురేఖలే మారిపోయాయి. పట్టణాల అభివృద్ధి కోసం ప్రతినెలా క్రమం తప్పకుండా నిధులు విడుదల చేసిన ఘనత కేసీఆర్ ది. ఆ నిధులతోనే ప్రతి మున్సిపాలిటీలో వైకుంఠధామాలు, వెజ్-నాన్ వెజ్ మార్కెట్లు, డంపింగ్ యార్డులు నిర్మించుకున్నాం. పారిశుధ్యం కోసం కొత్త వాహనాలు కొని, పట్టణాలను సుందరంగా తీర్చిదిద్దాం. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు ఇవ్వక, ఉన్నవాటిని నిర్వహించలేక పట్టణాలను గాలికొదిలేసింది.
కేసీఆర్ హయాంలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించాం. కానీ నేడు కాంగ్రెస్ పాలనలో కనీసం ఆ మంచినీటి సరఫరాను నిర్వహించడం కూడా చేతకాక ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. డ్రైనేజీల నిర్వహణ, పారిశుధ్యం వంటి కనీస అవసరాలు తీర్చడంలో పూర్తిగా చేతులెత్తేసిందన్నారు. అధికారంలోకి వస్తే వృద్ధులకు రూ.4000 పింఛను, మహిళలకు రూ.2500, విద్యార్థులకు భరోసా ఇస్తామని చెప్పి గద్దెనెక్కాక ఆ హామీలన్నింటినీ తుంగలో తొక్కింది. ప్రజలను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ తీరును ఎక్కడికక్కడ ఎండగట్టాలన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మంచి విజయాన్ని సాధించింది. అదే ఉత్సాహంతో రానున్న మున్సిపల్ ఎన్నికల్లోనూ పార్టీని మరింత బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగాలి. నాయకులంతా ఏకతాటిపై నిలిచి పనిచేయాలన్నారు. కార్యకర్తలు, నాయకులు ప్రతి ఇంటికి వెళ్ల నాడు కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధి నేడు కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న అన్యాయంపై ప్రజలకు వివరించాలి. సోషల్ మీడియాలోనూ, జనంలోనూ కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





