సిరిసిల్ల‌లో గులాబీ జెండా ఎగ‌ర‌డం ఖాయం

– బీఆర్ఎస్ పాల‌న‌లోనే సిరిసిల్ల అభివృద్ధి
– కాంగ్రెస్ బాకీ కార్డుల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించండి
– కాంగ్రెస్‌కు షాకిచ్చిన పంచాయ‌తీ ఫ‌లితాలు
– సిరిసిల్ల ఎన్నిక‌ల‌ను నేనే ప‌ర్య‌వేక్షిస్తా
– బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌

సిరిసిల్ల‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 22: సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో గులాబీ జెండానే ఎగరబోతుందని మెజారిటీ వార్డులను గెలవడమే లక్ష్యంగా బీఆర్‌ఎస్ పార్టీ ముందుకు సాగుతుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సిరిసిల్లలో మున్సిపల్ ఎన్నికలపై వార్డు ఇన్‌చార్జిలతో నిర్వహించిన సమావేశంలో ఆయన దిశానిర్దేశం చేశారు. సిరిసిల్ల ఒకప్పుడు ఎలా ఉందో.. బీఆర్‌ఎస్ పాలనలో ఇప్పుడు ఎలా అభివృద్ధి చెందిందో ప్రజలకు స్పష్టంగా వివరించాలని కేటీఆర్ సూచించారు. మన పని మనమే చెప్పుకోవాలి..వేరే ఎవరు చెప్పరు అని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత ఇక స్థానిక ఎన్నికలు ఉండవని, నేరుగా సాధారణ ఎన్నికలే ఉంటాయని పేర్కొంటూ సిరిసిల్ల మున్సిపాలిటీ గెలవడమే కాదు – అన్ని వార్డులను బీఆర్‌ఎస్ కైవసం చేసుకోవాల్సిందే అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాల పునర్విభజన పేరుతో గందరగోళం సృష్టిస్తోందని మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లాను ఎత్తివేయాలనే కుట్రలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని, ఈ అంశం సిరిసిల్ల ప్రజలు, న్యాయవాదులు, మేధావుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. జిల్లాలను ఎత్తివేయడానికి సిద్ధమైన ప్రభుత్వం సెస్‌ను కూడా ఎత్తివేయడంలో ఆశ్చర్యం లేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి పాలనను తుగ్లక్ తరహా పాలనగా అభివర్ణించారు. సర్పంచ్ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ షాక్‌లో ఉందని, అందుకే కార్పొరేషన్ ఎన్నికలు పెట్టడానికి భయపడుతోందని అన్నారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వేళ్ల మీద లెక్కపెట్టే స్థానాలను కూడా గెలవలేదన్నారు. సిరిసిల్ల పట్టణం గత 35 ఏళ్లుగా కాంగ్రెస్‌కు దూరంగా ఉందని, బీఆర్‌ఎస్ ఆవిర్భావం తర్వాత మున్సిపాలిటీపై పూర్తి ఆధిపత్యం సాధించామని కేటీఆర్ పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ చేసింది ప్రతి ఇంటికి చెప్పాలి.. కాంగ్రెస్ బాకీ కార్డు ప్రతి గడపకు తీసుకెళ్లాలి అని కేటీఆర్ పిలుపునిచ్చారు. సంక్రాంతి దాటినా రైతు బంధు రాలేదని, బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వలేదని, రిటైర్డ్ ఉద్యోగులకు పింఛన్లు కూడా దిక్కు లేని పరిస్థితి ఉందని విమర్శించారు. నేతన్నలకు నిజమైన అండగా నిలిచింది కేవలం బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికలను తానే పర్యవేక్షిస్తానని వెల్ల‌డించిన కేటీఆర్.. ప్రజలు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్‌ఎస్ వైపే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త, ప్రతి వార్డు ఇంచార్జి ప్రజల మధ్యకు వెళ్లాలని, అభివృద్ధిని వివరించి కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *