– సూర్యాపేటపై గులాబీ జెండా ఎగరడం ఖాయం
– బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి
సూర్యాపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 5: మోసపోతే గోసపడతామని కేసీఆర్ ఎన్నోసార్లు చెప్పిండు.. కాంగ్రెస్‌ను నమ్మినందుకు నట్టేట ముంచిండ్రు. మరోసారి మోసపోకుండా జాగ్రత్త పడాలి.. మున్సిపల్ ఎన్నికల్లో అరాచక కాంగ్రెస్‌ను ఓడించాలి.. అభివృద్ధికి కేరాఫ్‌గా ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థులకు పట్టం కట్టాలి అని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి పిలుపునిచ్చారు. సూర్యాపేట మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగరడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. పుట్టుకతో అజ్ఞానం ఉంటే జ్ఞానం పెరగదని, అందుకు రేవంత్‌రెడ్డే ఉదాహరణ అని అన్నారు. మిర్యాలగూడలో బుధవారం జరిగిన సభలో రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్తే అందరికీ జ్ఞానం పెరుగుతదని, కానీ రేవంత్‌రెడ్డికి ఉన్న జ్ఞానం పోయిందని అన్నారు. స్థాయికి దిగజారి సీఎం మాట్లాడుతున్నాడని విమర్శించారు. ప్రజలకు ఏం చేస్తాడో చెప్పకుండా కాంగ్రెస్ మోసాలను కప్పిపుచ్చేలా రేవంత్ రోత మాటలు మాట్లాడుతున్నారని జగదీష్‌రెడ్డి మండిపడ్డారు. ఆమరణ దీక్ష చేసి తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌ను స్వాతంత్య్రం తెచ్చిన గాంధీతో పోలుస్తూ ప్రజలు జాతిపిత అంటున్నారని చెప్పారు. రేవంత్ రెడ్డికి గతంలో చంద్రబాబు, ఇప్ప్పుడు సోనియా జాతిపితలని, భవిష్యత్తులో మోదీ కూడా జాతిపిత అవుతారేమోనని ఎద్దేవా చేశారు. నల్గొండ జిల్లా పర్యటనలో నిబంధనలకు వ్యతిరేకంగా రేవంత్ శంకుస్థాపనలు చేశాడన్నారు. సీఎం జిల్లాకు వస్తే ఏదో ప్రకటిస్తారని ప్రజలు ఆశిస్తారని, కానీ అవే బూతులు. అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఆయన రోత మాటలతో బీఆర్ఎస్కు మరింత బలం పెరుగుతున్నదన్నారు. కేసీఆర్ సాధించిన అభివృద్ధిని ఆయన ఆగం చేస్తున్నడు.. అభివృద్ధితోపాటు పదేండ్లలో పెంచిన పచ్చదనాన్ని ఎండబెడుతున్నడు.. కాంగ్రెస్ మాయమాటలు నమ్మి మోసపోయిండ్రని జగదీష్‌రెడ్డి అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




