హంగ్‌ ‌మున్సిపాలిటీల్లో చిత్ర విచిత్రాలు

– చైర్మన్ పదవుల్లో స్వతంత్రులు
– కొన్ని మున్సిపాలిటీల్లో వీరే కింగ్ మేకర్లు
– 11చోట్ల ఉద్రిక్తతల మధ్య ఎన్నికలు వాయిదా
– కాంగ్రెస్ అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తోందని విపక్షాల ధ్వజం
– బద్ధశత్రువుల మధ్య కుదిరిన‌స్నేహం

                                                                           (మండువ రవీందర్‌రావు)

రాష్ట్రంలో ఇటీవల జరిగిన కార్పొరేషన్‌, ‌మున్సిపాలిటీలకు సంబందించి మేయర్‌, ‌చైర్మన్‌ ‌పదవుల ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. ఎన్నికల సందర్భంగా పలు ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ధూషణలు, రాళ్ళ దాడులు, కిడ్నాపుల కారణంగా పోలీసులు లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. దీంతో పలుచోట్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి. వివిధ కారణాలతో వాయిదాపడిన దాదాపు 11 మున్సిపాలిటీలకు సంబందించిన  ఎన్నికలను మంగళవారం నిర్వహించే అవకాశముంది. రాష్ట్రంలోని 116 మున్సిపల్‌, ఏడు కార్పొరేషన్‌ ‌చేచైర్మన్‌ ‌ర్మన్‌, ‌డిప్యూటీ చైర్మన్‌ , ‌మేయర్‌, ‌డిప్యూటీ మేయర్‌ ఎన్నికలను సోమవారం నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటినుండి అనేక చిత్రవిచిత్ర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రధానంగా హంగ్‌ ఏర్పడిన 30కి పైగా ఉన్న మున్సిపాలిటీలపై దృష్టిపెట్టడంతో రాజకీయవేడి రాచుకుంది. వాస్తవంగా తాము సులభంగా గెలిచే మున్సిపాలిటీలను అధికార కాంగ్రెస్‌ ‌కావాలనే వాయిదా వేయించిందని బిఆర్‌ఎస్‌తోపాటు బిజెపికూడా ఆరోపించింది. తన అధికార బలంతో కాంగ్రెస్‌ పార్టీ అప్రజాస్వామ్యంగా వ్యవరిస్తున్నదని, సామధానభేద దండోపాయలతో గెలిచిన తమ సభ్యులను ఆ పార్టీ వైపు తిప్పుకుంటోందని ఆ పక్షాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా స్వతంత్రులు, ఎక్స్ అఫిసియో సభ్యులు ప్రధానపాత్ర పోషించారనే చెప్పాలె. కాగా, అనుకోని రీతిలో ఇండిపెండెంట్‌ ‌సభ్యులకు అదృష్టం కలిసివచ్చింది. అధికార కాంగ్రెస్‌, ‌ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్‌ఎస్‌కు సమాన స్థానాలు వచ్చిన దగ్గర ఇండిపెండెంట్‌ల భూమిక ప్రధానంగా మారింది. దాంతో ఇండిపెండెంట్స్ ‌కూడా కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలన్నట్లుగా ఏకంగా మేయర్‌ ‌పదవులను ఆశించడం, అలంకరించడం ఈ ఎన్నికల్లో ఒక వింత పరిణామం. అమనగల్‌లో బిఆర్‌ఎస్‌నుంచి గెలిచిన నేనవత్‌ ‌పత్యానాయక్‌ ‌కాంగ్రెస్‌లోచేరి చేర్మన్‌ ‌పదవిని పొందారు. అలాగే భైసాలోకూడా ఇండిపెండెంట్‌గా గెలిచిన తూము దత్తాత్రి అక్కడ చేర్మన్‌గా ఎన్నికైనారు.  ఇదిలాఉంటే గతంలో ఏనాడు ప్రధాన ప్రత్యర్థి పార్టీలు బహిరంగంగా పొత్తులు కుదుర్చుకున్న దాఖలాలులేవు, ఒకవేళ తప్పని పరిస్తితిలో ఒకటిరెండుచోట్ల జరిగినా అదిపెద్ద ప్రచారంలో ఉండేది కాదు. కాని నిన్నటివరకు కత్తులు దూసుకున్న పార్టీలు ఏకంగా చేర్మన్‌, ‌డిప్యూటీ చేర్మన్‌ ‌పదవులను పంచుకోవడం ఈ ఎన్నికల్లో మరో విచిత్రాంశంగా నిలిచింది. కాంగ్రెస్‌, ‌బిజెపిలు ఒకటేనని బిఆర్‌ఎస్‌, ‌బిఆర్‌ఎస్‌ ‌కాంగ్రెస్‌ ఒకటని బిజెపి, బిజెపి, బిఆర్‌ఎస్‌లు ఒకటని కాంగ్రెస్‌లు గత రెండేళ్ళుగా ఒకదానిపై ఒకటి ఆరోపించుకుంటూనే ఉన్నాయి. ఈ ఎన్నికల్లో కూడా ఎట్టి పరిస్థితిలో రెండోపార్టీకి అవకాశంలేకుండా అన్నీ తామె గెలుచుకోవాలన్నట్టుగా పోటీ పడ్డాయి. కాని మేయర్‌, ‌చేర్మన్‌ ఎన్నికలు వచ్చేసరికి ఈ పార్టీలు తమ పంతాను వీడాయి. అధికార పీఠాన్ని హస్తగతం చేసుకునేందుకు ఒకదానికి ఒకటి సహరించుకున్నాయి. ఆవిధంగా అమనగల్‌, ‌నర్సాపూర్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌, ‌బిజెపిలు ఒకటైనాయి. జిన్నారం, ఎల్లంపేట ఎన్నికల్లో బిజెపి, బిఆర్‌ఎస్‌ ఒకటైనాయి. నిజామాబాద్‌ ‌కార్పోరేషన్‌ ‌విషయంలో కాంగ్రెస్‌, ఎంఐఎం‌లు సహకరించుకున్నాయి. వనపర్తి జిల్లా అమరచింతలో కాంగ్రెస్‌, ‌బిజెపి, బిఆర్‌ఎస్‌లకు సమాన స్థానాలురాగా చివరినిమిషంలో బిఆర్‌ఎస్‌నుంచి కాంగ్రెస్‌లో చేరిన సువర్ణకు చేర్మన్‌ ‌పదవి దక్కింది. అలంపూర్‌లో బిఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌సమానంగా అయిదేసి స్థానాలు వచ్చినా అక్కడ బిఆర్‌ఎస్‌కు కాంగ్రెస్‌ ‌సహకరించడంతో ఆ పార్టీకి చెందిన పి. జయరాముడు చేర్మన్‌గా ఎన్నికైనారు. ఇస్నాపూర్‌లో మరో విచిత్రకర పరిణామం. ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌నుంచి గూడెం మహిపాల్‌రెడ్డి (ఎంఎల్సీ)మళ్ళీ బిఆర్‌ఎస్‌కు మద్దతు పలుకడంతో అక్కడ పరిస్థితులే మారిపోయాయి. ఇస్నాపూర్‌లో 26 స్థానాల్లో కాంగ్రెస్‌ 10, ‌బిఆర్‌ఎస్‌ 12, ‌స్వతంత్రులు నలుగురు గెలిచారు. అయితే నలుగురిలో ముగ్గురు ఇండిపెండెంట్‌లు కాంగ్రెస్‌లోకి, ఒకరు బిఆర్‌ఎస్‌లో చేరడంతో కాంగ్రెస్‌, ‌బిఆర్‌ఎస్‌కు సమాన ఓట్లు వచ్చాయి. ఇక్కడ ఎక్స్అఫిషియోగా గూడెం మహిపాల్‌ఓటుతోపాటు బిజెపి ఎంపి రఘునందన్‌రావు ఓటు పడడంతో ఇక్కడ బిఆర్‌ఎస్‌ ‌నుండి చేర్మన్‌గా మోతె సుమలత, వైస్‌ ‌చేర్మన్‌గా పటోళ్ళ మాధవి నెగ్గారు.

11 మున్సిపాలిటీల్లో ఎన్నికలు వాయిదా

వివిధ కారణాలతో 11 మున్సిపాలిటీల్లో ఎన్నికలు వాయిదాపడినాయి. వాటిల్లో ఇల్లందు, సుల్తానాబాద్‌, ఇ‌బ్రాహింపట్నం, కాగజ్‌నగర్‌, ‌క్యాతంపల్లి, ఖానాపూర్‌, ‌జహీరాబాద్‌, ఇం‌ద్రేశం, డోర్నకల్‌, ‌జనగామ, తొర్రూర్‌లున్నాయి. జనగామ, తొర్రూర్‌లో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. తమకు మెజార్టీ ఉన్నా అధికార కాంగ్రెస్‌ ‌కావాలనే ఎన్నికలను వాయిదావేసిందని అక్కడి బిఆర్‌ఎస్‌ ‌నాయకులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్‌ ఎం‌పి కడియం కావ్య ఎక్స్ అఫిసియో ఓటుపై బిఆర్‌ఎస్‌ అభ్యంతరం వ్యక్తంచేయడం వివాదానికి దారితీసింది. దీంతో ఇక్కడ కాంగ్రెస్‌, ‌బిఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలు కొట్టుకోవడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. బిఆర్‌ఎస్‌ ‌పార్టీకి చెందిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, స్థానిక కాంగ్రెస్‌ ఎంఎల్‌ఏ ‌యశస్వినిరెడ్డి మున్సిపల్‌ ‌కార్యాలయంలోకి దూసుకుపోవడంకూడా గొడవకు కారణంగా మారింది. దీంతో పోలీసులు ఇక్కడ 144 సెక్షన్‌ అమలుచేసి ఎన్నికలను వాయిదావేశారు. అలాగే జనగామలోకూడా బిఆర్‌ఎస్‌ ‌నుంచి ఎన్నికైన వార్డు సభ్యుడిని కిడ్నాప్‌ ‌చేశారన్న ఆరోపణతో తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. దీంతో ఇక్కడకూడా ఎన్నికలు వాయిదా వేశారు. ఇంద్రేశం, జహీరాబాద్‌లో కోరంలేదని వాయిదావేశారు. ఇలా ఈ పదకొండు మున్సిపాలిటీలు ఏదోఒకకారణంతో వాయిదా పడ్డాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *