– జూమ్ వేదికగా పనోరమ ఇంటర్నేషనల్ ప్రత్యక్ష ప్రసారం
– అభినందనలు తెలిపిన పలు రంగాల ప్రముఖులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2: శూన్యం, బిగ్ బ్యాంగ్ పుస్తక రచనలతో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన ప్రైవేటు ఫ్యాకల్టీ, కవి, రచయిత ఫిజిక్స్ అరుణ్‌కుమార్ ఆదివారం రాత్రి జూమ్ వేదికగా నిర్వహించిన ప్రత్యక్ష ప్రసారంలో ఇండియా ప్రతినిధిగా కవితాగానం చేశారు. రైటర్స్ కేపిటల్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పనోరమ ఇంటర్నేషనల్ లిటరేచర్ ఫెస్టివల్-2026లో భాగంగా ది ఎలిమెంట్ ఆఫ్ ఎర్త్ అనే థీమ్‌తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఫిజిక్స్ అరుణ్ ‘అవని.. ప్రేమ కిరణాల కవనమై..!’ శీర్షికతో చదివిన కవిత ద్వారా గాంధీజీ, రవీంద్రనాథ్ ఠాగూర్ స్ఫూర్తితో విస్ఫూర్తితో విశ్వమంతా ప్రేమమయమై, యుద్ధాలు లేని ప్రపంచంలో పర్యావరణహితమై అందరూ సుఖశాంతులతో జీవించాలని, ప్లాస్టిక్ వినియోగ రహిత అవనిపై పచ్చని చెట్ల చిరునవ్వుల వెలుగుల మధ్య పుడమిపై పున్నమి వెన్నెల పూయాలనీ, లౌకిక తాత్విక స్ఫూర్తితో వసుదైక కుటుంబమై మనమంతా మెలగాలనీ.. అంటూ తన కవితతో ప్రపంచానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ ఇరానీడౌరా కవడియా, సమన్వయకర్తగా డాక్టర్ రామకృష్ణ పెరుగు, ముఖ్య అతిథిగా డాక్టర్ రామ్మోహన్ రావు, గౌరవ అతిథిగా లక్ష్మీనారాయణ్ కొల్లి, వినోద్ కుత్తుం, మిరప మహేష్, సుధా మురళి, వశిష్ట సోమేపల్లి, మందారపు హైమావతి ప్రతినిధులుగా పాల్గొన్నారు. అంతర్జాతీయస్థాయి కార్యక్రమంలో పాల్గొనడంపై వివిధ రంగాల ప్రముఖులు, విద్యార్థులు, మిత్రులు తదితరులు వివిధ సోషల్ మీడియా వేదికగా అరుణ్‌కు అభినందనలు తెలిపారు. తనకి ఇంతటి మంచి అవకాశాన్ని కల్పించిన ఫౌండేషన్‌కు, డాక్టర్ పెరుగు రామకృష్ణ తదితర సభ్యులకు అరుణ్ కృతజ్ఞతలు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





