మహిళా విద్యకు ఆద్యులు ఫూలే దంపతులు

– ఓబీసీల, మహిళాభ్యున్నతికి చేసిన కృషి చిరస్మరణీయం
– జ్యోతిరావు ఫూలేకు నివాళులర్పించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11: ఓబీసీల అభ్యున్నతికి, మహిళా సాధికారతకు మహాత్మా జ్యోతిరావు ఫూలే చేసిన కృషి చిరస్మరణీయమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి కొనియాడారు. సామాజిక విప్లవకారుడైన జ్యోతిరావు ఫూలే 200వ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. అంబర్‌పేటలోని ఫూలే విగ్రహానికి శనివారం ఆయన పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు. జ్యోతిరావు ఫూలే, ఆయన భార్య సావిత్రిబాయి ఫూలేలు దేశంలో మహిళా విద్యకు ఆద్యులని, వారు వేసిన పునాదుల వల్లే నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని పేర్కొన్నారు. వెనుకబడిన తరగతులు, సమాజంలో అణగారిన వర్గాల విముక్తి కోసం, వారి సామాజిక సమానత్వం కోసం ఫూలే దంపతులు తమ జీవితాంతం అంకితభావంతో పనిచేశారని గుర్తు చేశారు.

మహిళా రిజర్వేషన్లు – విప్లవాత్మక నిర్ణయం

మహిళా హక్కుల విషయంలో ఫూలే ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని నరేంద్ర మోదీ ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే చరిత్రాత్మక నిర్ణయం, ఫూలే కలలను నిజం చేసే దిశగా వేసిన విప్లవాత్మక, సాహసోపేతమైన నిర్ణయమని అభివర్ణించారు. పూలే స్ఫూర్తితోనే వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం జాతీయ స్థాయిలో కుల గణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఇలాంటి సమగ్ర గణన జరగడం ఇదే తొలిసారి అని స్పష్టం చేశారు. బీసీ వర్గాల సామాజిక, ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి ఫూలే చేసిన పోరాటమే ఈ నిర్ణయానికి ప్రధాన స్ఫూర్తి అని పేర్కొన్నారు.

దివ్యాంగుల సంక్షే కేంద్ర ప్రభుత్వ పథకాలు

ఫూలే 200వ జయంతి ఉత్సవాలను బీజేపీ, కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నాయని మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని సనత్‌నగర్, సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న దివ్యాంగులను గుర్తించి వారికి అవసరమైన వివిధ పరికరాలను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. సికింద్రాబాద్ నియోజకవర్గం లాలాపేట్ డివిజన్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో దివ్యాంగులకు అవసరమైన పరికరాలను ఆయన పంపిణీ చేశారు. బ్యాటరీతో నడిచే ట్రై సైకిల్స్, సాధారణ ట్రై సైకిల్స్, వీల్ చైర్స్, హియరింగ్ ఎయిడ్స్ (చెవిటి వారికి), ఊతకర్రలు, సెల్‌ఫోన్లు వంటివి ఉన్నాయి. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రూ.2కోట్ల విలువైన వస్తువులను సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో దివ్యాంగుల కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం మంజూరు చేసిందని, సమాజంలో అందరికంటే చిట్టచివర ఉన్న వ్యక్తికి మొదటగా సహకారం అందించాలన్నదే ప్రధాని ఆలోచన అని చెప్పారు. మోదీ ప్రభుత్వం విద్య, ఉద్యోగాల్లో దివ్యాంగుల రిజర్వేషన్లను 3 శాతం నుండి 4 శాతానికి పెంచిందన్నారు. దివ్యాంగులను ఎవరైనా విమర్శించినా, అవహేళన చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ఎస్సీ, ఎస్టీ ప్రొటెక్షన్ యాక్ట్ తరహాలో చట్టాలను తీసుకొచ్చామన్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో దివ్యాంగుల కోసం ప్రత్యేకమైన ర్యాంప్‌లు, క్యూ లైన్లు, వాష్ రూమ్స్ ఏర్పాటు చేయడానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. దివ్యాంగుల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *