ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ కొనసాగుతోంది

– పరికరాలు ఎక్కడెక్కడ పెట్టారో ఆరా తీస్తున్నాం
– బాధ్యుల‌ను వ‌దిలిపెట్టం
– మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
– పుర పోరులో కాంగ్రెస్ ప్రభంజనం
– 80 శాతంపైగా స్థానాలు కైవసం చేసుకోవడం ఖాయం

ఖమ్మం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10: రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలోనేకాక ప్రస్తుతం కూడా ఫోన్ ట్యాపింగ్ కొనసాగుతోందని, దీనిపై ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా ఉందని వెల్లడించారు. ఖమ్మంలోని ఓ కన్వెన్షన్ హాల్‌లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ట్యాపింగ్ కోసం ఎక్కడెక్కడ పరికరాలు అమర్చారో ప్రభుత్వం ఇప్పటికే ఆరా తీస్తోందని, విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, జరుగుతోందని అనేకమంది గగ్గోలు పెడుతున్నారు.. ఇది అక్షరాలా నిజం. ఇప్పుడు కూడా కొందరు ఈ అక్రమాలకు పాల్పడుతున్నారు. దీనిపై ప్రభుత్వం విచారణ జరుపుతోంది.. ఎవరు సూత్రధారులు? ఎక్కడెక్కడ పరికరాలు పెట్టారు? అనేది బయటకు తీస్తాం. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని స్పష్టం చేశారు. ఉద్యోగులను ఓట్లు అడగడంలో తప్పేముందని, తన పార్టీ తరపున తాను అడిగానని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

80 శాతంపైగా సీట్లు కాంగ్రెస్‌వే

పోలింగ్ జరగనున్న 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించబోతోందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. గత రెండేళ్లలో మేం చెప్పిన ప్రతి మాటను నిలబెట్టుకుని ప్రజలకు చేరువయ్యాం. అందుకే ఈ పుర ఎన్నికల్లో 80 శాతానికిపైగా స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోబోతోందని చెప్పారు. ఇది జీర్ణించుకోలేకే ప్రతిపక్ష నాయకులు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆరఎస్ విసిరిన సవాళ్లను ప్రజలు తిప్పికొట్టారు.. అదే ఫలితం రేపు పునరావృతం కాబోతుంది అని అన్నారు.

అభివృద్ధికి పెద్ద పీట

గత ప్రభుత్వ తీరుపై పొంగులేటి తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నాటికి ధనిక తెలంగాణను రూ.8.19 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారు. నెలకు రూ.6,300 కోట్లు కేవలం అప్పులకే కడుతూ కూడా సంక్షేమాన్ని ఆపలేదు. గత దొరల పాలనలో పేదలను విస్మరించారు. 62 వేల డబుల్ బెడ్ రూంలను మొండిగోడలుగా మిగిల్చారు. కానీ మేం 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాం. వరి వేస్తే ఉరి అన్న కాలం పోయి ఇప్పుడు వడ్లకు బోనస్ ఇస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నాం అని వివరించారు. మాజీ మంత్రుల అసభ్య పదజాలానికి ప్రజలు ఓటు ద్వారానే తగిన గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *