– సీబీఐకి అప్పగించాలని ఆలోచన
హైదరాబాద్, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 19 : గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్‌పై రేవంత్‌రెడ్డి సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే ఈ వ్యవహారంపై సిట్‌ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ విచారణలో భాగంగా సిట్ అధికారులు కీలక ఆధారాలను సేకరించారు. ఆ క్రమంలో పలువురిని విచారించి ముఖ్యమైన ఆధారాలను సేకరించిన సంగతి తెలిసిందే. మరో వైపు రూ. లక్షల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ వ్యవహారాన్ని సైతం ఇప్పటికే రేవంత్ సర్కార్ సీబీఐకి అప్పగించిన విషయం విదితమే. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ వోటరు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడంతో రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ కొలువు తీరింది. అయితే కేసీఆర్ ప్రభుత్వ హయాంలో విపక్ష పార్టీల్లోని కీలక నేతలపైనే కాకుండా.. స్వపక్షంలోని పలువురు నేతల ఫోన్లు సైతం ట్యాపింగ్ గురైనట్లు గుర్తించారు. దీంతో ఈ వ్యవహారంపై రేవంత్ సర్కార్ సిట్‌ను ఏర్పాటు చేసింది. సిట్ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వొచ్చాయి. అంతేకాక పలువురు పోలీస్ ఉన్నతాధికారులు సైతం ఈ వ్యవహారంలో అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ కేసును సైతం సీబీఐకి అప్పగించేందుకు రేవంత్ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు లక్షల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్మించింది. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు మేడిగడ్డ బ్యారేజీలోని పిల్లర్లు కుంగాయి. దీంతో బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై నాటి ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పించాయి. దాంతో తాము అధికారంలోకి వస్తే ఈ వ్యవహరంపై విచారణ జరుపుతామని అప్పటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. ఆ క్రమంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. దాదాపు 13 నెలల విచారణ అనంతరం నివేదికను ప్రభుత్వానికి అప్పగించింది. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసును సైతం సీబీఐకి అప్పగించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





