– మధ్యంతర ఉత్తర్వులు కూడా వీటికే పరిమితం చేయాలి
– సుప్రీంకోర్టును కోరిన కేంద్ర ప్రభుత్వం
వక్ఫ్ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఏవైనా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తే.. దాన్ని మూడు అంశాలకే పరిమితం చేయాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. వక్ఫ్ చట్టంపై దాఖలైన పిటిషన్లపై జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా కేంద్రం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్రం తరఫున వాదనలు వినిపిస్తూ.. గత బెంచ్ లాగానే విచారణను పరిమితం చేయాలని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్ ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. కోర్టు మూడు అంశాలను గుర్తించిందని తుషార్ మెహతా తెలిపారు. ఆ మూడు అంశాలపై సమాధానం ఇచ్చామని.. తాజాగా పిటిషనర్లు అనేక ఇతర అంశాలను లేవనెత్తుతున్నారన్నారు.తాము మూడు అంశాలపై అఫిడవిట్ దాఖలు చేశామని తెలిపారు. కేసు విచారణను ఈ మూడు అంశాలకే పరిమితం చేయాలనేది కేంద్రం తరఫున విజ్ఞప్తి చేశారు. అయితే పిటిషనర్ల తరఫున హాజరైన న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వి సొలిసిటర్ జనరల్ వాదనను వ్యతిరేకించారు.
ఇంతకు ముందు ఏప్రిల్ 17న జరిగిన విచారణలో వక్ఫ్ బైయూజర్‌తో సహా ఏ వక్ఫ్ ఆస్తిని డీనోటిఫై చేయబోమని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది. అలాగే, వక్ఫ్ బోర్డులలో కొత్త నియామకాలు చేపట్టబోమని సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇదిలా ఉండగా.. మూడు అంశాల విషయానికి వస్తే.. వక్ఫ్ బై యూజర్ లేదంటే.. వక్ఫ్ బై డీడ్ కింద వక్ఫ్‌గా ప్రకటించిన ఆస్తులను తొలగించే అధికారం కాగా.. రాష్ట్రాల వక్ఫ్ బోర్డులు, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ ముస్లిమేతరులను నియమించడాన్ని ముస్లింలు వ్యతిరేకించడం రెండో అంశం కాగా.. మూడో అంశం నిబంధనకు సంబంధించింది. సర్వే బాధ్యత సర్వే కమిషనర్ నుంచి కలెక్టర్ అధికారం ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు ఆమోదించిన చట్టం రాజ్యాంగబద్ధమేననే భావన ఉందని, స్పష్టమైన సందర్భం వెల్లడి కానప్పుడు కోర్టులు జోక్యం చేసుకోకూడదని అన్నారు. మరీ ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కోర్టులు జోక్యం చేసుకోరాదన్నారు. అంతకన్నా తాము చెప్పవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు. వక్ఫ్‌ను స్వాధీనం చేసుకోవడం ఈ చట్టం ఉద్దేశమని పిటిషనర్ల తరఫు లాయర్ కపిల్ సిబాల్ అన్నప్పుడు సీజేఐ ఈ కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
వక్ఫ్ చట్టంపై గత విచారణ సందర్భంగా, మూడు అంశాలపై మధ్యంతర ఆదేశాలు జారీ చేయడానికి వాదనలు వింటామని ధర్మాసనం పేర్కొంది. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులను నియమించబోమని, ఈ మూడు అంశాలపై వెంటనే ఎలాంటి చర్యలు తీసుకోబోమని సుప్రీంకోర్టుకు గత విచారణలో కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. కాగా, మంగళవారంనాడు విచార సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ, వక్ఫ్ చట్టం చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడానికి విచారణను మూడు అంశాలకే పరిమితం చేయాలని కోరారు. కోర్టు గుర్తించిన మూడు అంశాలకు తాము సమాధానం దాఖలు చేశామన్నారు. అయితే ఇప్పుడు పిటిషనర్ల లిఖిత పూర్వక సమాధానాలు ఇతర అంశాలను ప్రస్తావించాయని, అందువల్ల విచారణను ఈ మూడు అంశాలకే పరిమితం చేయాలని కోరారు.




