– ప్రజలకు గౌరవప్రదమైన సేవలే లక్ష్యం
– రెవెన్యూ మంత్రి పొంగులేటి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25: రాష్ట్రంలో ప్రజలకు మరింత సౌకర్యవంతమైన, పారదర్శకమైన పరిపాలన అందించాలనే లక్ష్యంతో తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. మొదటి దశలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న 60 తహసీల్దార్ కార్యాలయాలు, ఐదు ఆర్డీవో కార్యాలయాలకు ఆధునిక సౌకర్యాలతో శాశ్వత భవనాలు నిర్మిస్తామని, రెండో విడతలో శిథిలావస్ధలో ఉన్న 170 ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాలను నిర్మిస్తామని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని భవనాలు ఒకే నమూనాలో, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా డిజైన్ చేయనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి డిజైన్లకు తుది రూపు ఇస్తామని చెప్పారు. తక్కువ ఖర్చుతో ప్రజలకు అత్యుత్తమ సేవలందేలా ఈ భవనాల నిర్మాణం ఉంటుందన్నారు. సచివాలయంలో తన కార్యాలయంలో రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి బుధవారం సమీక్ష నిర్వహించారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాల, శిథిలావస్ధ, పాలనకు అనువుగా లేని భవనాల వివరాలను సేకరించారు. ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగడం సరైంది కాదు.. ప్రజలకు సేవలందించే కేంద్రాలు గౌరవప్రదంగా ఉండాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనÅ£నుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ముందుచూపు లేకుండా, ప్రణాళిక లేకుండా మండలాల పునర్విభజన చేపట్టిందని, కొన్ని మండలాలు రెండుమూడు జిల్లాల పరిధిలోకి వచ్చే విధంగా రూపొందించిందని, ప్రజలకు దూరంగా కలెక్టరేట్లు నిర్మించి నిర్వహణను గాలికి వదిలేశారని విమర్శించారు. అనేక కార్యాలయాల్లో కనీస వసతులు లేకపోవడం, సిబ్బంది కొరత తీవ్రంగా ఉండడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త మండలాలకు అవసరమైన పోస్టులు మంజూరు చేసి పరిపాలనను బలోపేతం చేశామని తెలిపారు. అలాగే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో అత్యాధునిక వసతులతో సమీకృత భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని మంత్రి తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లోని 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను 12 క్లస్టర్లుగా విభజించి సమీకృత భవనాలు నిర్మిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే గచ్చిబౌలి, మేడ్చల్-మల్కాజిగిరి, పటాన్‌చెరులలో భవనాలకు శంకుస్థాపన పూర్తయిందని, గచ్చిబౌలిలో నిర్మాణ పనులు తుది దశలో ఉండి మరికొద్ది నెలల్లో ప్రారంభానికి సిద్ధమవుతుందని తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





