స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష‌న్స్‌ శాఖలో సంస్క‌ర‌ణ‌లు

– స‌మీకృత కార్యాల‌య వ్య‌వ‌స్థ అమ‌లు
– ద‌శ‌లవారీగా 94 స‌బ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు
– శాసనమండలిలో రెవెన్యూ మంత్రి పొంగులేటి

హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 5ః  ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆలోచ‌న‌ల‌కనుగుణంగా స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల‌కు వ‌చ్చే ప్ర‌జ‌ల‌కు స‌మర్ద‌వంతంగా, సులువుగా పార‌ద‌ర్శ‌కంగా, అవినీతిర‌హితంగా మెరుగైన సేవ‌లు అందించ‌డానికి అనేక సంస్క‌ర‌ణ‌లు తీసుకొచ్చినట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శాసన మండలిలో సోమవారం ఎమ్మెల్సీ ఎ.వి.ఎన్ రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయ‌న‌ సుదీర్ఘంగా జవాబు ఇచ్చారు. ఆస్తుల రిజిస్ట్రేష‌న్ కోసం స‌బ్ రిజిస్ట్రార్ కార్యాలయాల‌కు వ‌చ్చి గంట‌లత‌ర‌బ‌డి చెట్ల కింద నిరీక్షించే ప‌రిస్ధితికి తెరదించుతున్నామ‌ని, స‌మీకృత స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌య వ్య‌వ‌స్ధ వ‌ల‌న అవినీతికి అడ్డుక‌ట్ట‌ప‌డుతుంద‌ని తెలిపారు. రాష్ట్రంలోని 144 స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాలకు గాను 94 అద్దె భవనాల్లో, 50 ప్రభుత్వ భవనాల్లో కొనసాగుతున్నాయంటూ మూడు దశల్లో వీటికి శాశ్వత భవనాలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామ‌ని వివ‌రించారు. ప్ర‌జ‌ల‌కు సౌకర్య‌వంతంగా ఉండేలా ప‌రిపాల‌న‌కు ఇబ్బంది లేకుండా అత్యాధునికంగా కార్పొరేట్ స్ధాయిలో నిర్మిస్తున్నామ‌న్నారు. మొద‌టి ద‌శ‌లో ఔట‌ర్ రింగ్ ప‌రిధిలో హైద‌రాబాద్, రంగారెడ్డి, మేడ్చ‌ల్, సంగారెడ్డి నాలుగు జిల్లాల్లోని 39 స‌బ్‌ రిజిస్ట్రార్ కార్యాల‌యాల‌ను 11 క్లస్టర్లుగా విభజించి స‌మీకృత‌ స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌య భ‌వ‌నాలు నిర్మిస్తున్నామ‌ని, ఈ 39 సబ్ రిజిస్త్ట్రార్ కార్యాలయాల నుంచి 69 శాతం ఆదాయం వస్తుంద‌ని పేర్కొన్నారు. గచ్చిబౌలిలోని తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్‌మెంట్ (తాలిమ్) (ఆర్వో రంగారెడ్డి, గండిపేట్‌, శేర్‌లింగంప‌ల్లి, రాజేంద్ర‌న‌గ‌ర్‌) క్లస్టర్గా విభజించామ‌ని, ఈ భవనానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశార‌ని చెప్పారు. ఈ నెల చివరి నాటికి మిగిలిన ప‌ది సమీకృత భవనాలకు కూడా శంకుస్థాపన చేస్తామ‌న్నారు. ప్రభుత్వం తరపున ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా ప్రైవేట్ బిల్డర్స్ ఈ భవనాలను నిర్మించేలా ప్రణాళికలు తయారు చేసిన‌ట్లు మంత్రి పొంగులేటి చెప్పారు. ఒక్కో సమీకృత సబ్ రిజిస్టర్ కార్యాలయానికి మూడు నుంచి నాలుగెకరాల స్థలాన్ని కేటాయించామ‌ని, రెండో దశలో జిల్లా కేంద్రాలలో, మూడోదశలో నియోజకవర్గాలలో భవనాలను నిర్మిస్తామ‌ని, మొదటి అయిదేళ్లు ఈ భవనాలను నిర్మించిన సంస్ధ నిర్వ‌హ‌ణ చేప‌డుతుంద‌ని, ప్రభుత్వానికి ఒక్క‌ రూపాయి కూడా ఖర్చు లేద‌ని అన్నారు. స్లాట్ బుకింగ్ విధానం తీసుకురావడం వల్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ సమయం కూడా చాలావరకు తగ్గిందని, ఒక్కో డాక్యుమెంట్ 18 నుంచి 21 నిమిషాల్లోనే పూర్తవుతుందని తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *