– ఖమ్మం జిల్లాలో కొత్తగా 24818 కుటుంబాలకు రేషన్ కార్డులు
– 3,37,898 మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు
– వైరాలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం
– ఐదు మండలాల్లో బల్క్ మిల్క్ కూలింగ్ కేంద్రాలు
– జమలాపురంలో అటవీ పార్కు
– పంద్రాగస్టు వేడుకలలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ప్రజల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం పాలన కొనసాగిస్తున్నదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా పాల్గోన్నారు. శుక్రవారం ఉదయం ముఖ్య అతిథి పోలీసు గౌరవ వందనం స్వీకరించి, జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 70 ఏళ్ళుగా పి.డి.ఎస్ వ్యవస్థ పేద ప్రజల ఆహార భద్రతకు భరోసా ఇస్తుందని, అదే స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీని ప్రారంభించిందని అన్నారు. పేదల ఆత్మగౌరవానికి మరో ప్రతీక రేషన్ కార్డులను అర్హులైన పేద కుటుంబాలు అందరికీ పంపిణీ చేస్తున్నామని, ఖమ్మం జిల్లాలో నూతనంగా 24818 కుటుంబాలకు రేషన్ కార్డ్ లు జారీ చేశామని అన్నారు.రైతు సంక్షేమానికి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత కల్పించిందని,ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రూ.2లక్షల వరకు రుణ మాఫీ చేసామని అన్నారు. రైతులకు అందించే పెట్టుబడి సహాయాన్ని రూ.12 వేల రూపాయ లకు పెంచి, వానాకాలం పంటకు ఖమ్మం జిల్లాలో 3,37,898 మంది రైతుల ఖాతాలో రూ.427.38 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేసామని డిప్యూటీ సీఎం అన్నారు.యాసంగి సీజన్ లో 34305 మంది రైతుల వద్ద నుండి రూ.545 కోట్ల విలువ గల 2360000 వేల క్వింటాళ్ల వరి ధాన్యం కొనుగోలు చేసి 48 గంటలలోగా చెల్లింపులు చేసామని తెలిపారు. మద్దుల పల్లిలో 19 కోట్ల 95 లక్షల రూపాయలు ఖర్చు చేసి నూతన వ్యవసాయ మార్కెట్ ఏర్పాటు చేశామని, ఖమ్మంలో 155 కోట్లతో మోడల్ మిర్చి మార్కెట్ నిర్మిస్తున్నామని అన్నారు. ఖమ్మం జిల్లాలో 16153 మంది లబ్దిదారులకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ప్రభుత్వం మంజూరు చేసిందని, ఇంటి నిర్మాణ పురోగతి ప్రకారం నాలుగు దశలలో గ్రీన్ ఛానల్ ద్వారా ప్రభుత్వం లబ్ధిదారులకు నేరుగా రూ. 5 లక్షలు జమ చేస్తుందన్నారు. అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసి అర్హులైన పేదలకు పారదర్శకంగా అందజేస్తున్నామని అన్నారు. నేటి వరకు జిల్లా వ్యాప్తంగా మహిళలు 4 కోట్ల 22 లక్షల 98 వేల 507 ఉచిత బస్సు ప్రయాణాలు చేయడం వల్ల 198 కోట్ల 34 లక్షల 49 వేల రూపాయలను ఆదా చేశారని అన్నారు.మహాలక్ష్మి పథకం క్రింద జిల్లాలో 229034 కుటుంబాలు లబ్ది పొందినట్లు తెలిపారు. గృహజ్యోతి పథకం క్రింద జిల్లాలో రూ.150 కోట్ల సబ్సీడి చెల్లించి 248995 కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేశామని తెలిపారు




