తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టిందే ‘పీపుల్స్‌వార్’

– కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు ఆశన్న
– స్వగ్రామంలో ఆత్మీయ పలకరింపు
– వందలాదిగా తరలివచ్చిన ప్రజలు

వెంకటాపూర్, ప్రజాతంత్ర, మార్చి 11: తెలంగాణ సాయుధ పోరాట వారసత్వంగా మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టింది పీపుల్స్‌వార్ పార్టీనేనని, వరంగల్ డిక్లరేషన్‌తో మొదలుపెట్టి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లగా రాష్ట్రవ్యాప్తంగా మరికొందరు ముందుకు వచ్చారని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న పేర్కొన్నారు. వెంకటాపూర్ మండలంలోని ఆయన పుట్టిన గ్రామం నర్సింగాపూర్‌లో ఎర్రబెల్లి గోపాలరావు ఇంటి వద్ద బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నాలుగున్నర దశాబ్దాల తర్వాత స్వగ్రామం వచ్చిన ఆయన బాల్యమిత్రులు, బంధువులు, గ్రామస్తులను ఆత్మీయంగా పలకరించారు. ఆయనను చూసేందుకు వందలాదిగా ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆశన్న మాట్లాడుతూ చిన్ననాటి జ్ఞాపకాలు ఉన్న నర్సింగాపూర్‌లో మళ్లీ అడుగుపెట్టడం ఊహించనటువంటిదని అన్నారు. రాంపూర్ నేపథ్యంలో గత సంఘటనలతోపాటు తండ్రి భిక్షపతిరావు నేర్పించిన అక్షరజ్ఞానం, ఆయన ప్రశ్నించే తత్వం తనకు వచ్చాయన్నారు. సత్తన్నను నక్సలైట్లు చంపడం తనకు గుర్తుందన్నారు. ప్రశ్నించిన తమ తండ్రిని పోస్టర్లు వేసి శిక్షిస్తామన్నారని, తర్వాత అంతిరెడ్డి నాయకత్వంలో పొరపాటును గుర్తించినట్లు తెలిపారు. అమ్మమ్మ గ్రామం రాంపూర్‌లోని భూస్వాములు, అగ్రకుల వాతావరణం చూసిన తనకు ఆర్ఎస్ఎస్ నేపథ్యం, పల్లెలోని పూరి గుడిసెలు ఎండాకాలంలో కాలిపోవడం వంటి సంఘటనలు సమాజంలోని సమస్యలు ఆలోచింపచేశాయన్నారు. అప్పుడే రాడికల్ విద్యార్థి సంఘం ఉండేదని, ఆర్ఎసి మెస్ వర్కర్స్ వాళ్లతో పరిచయాలు ఉండేవని, చెన్నారెడ్డి ప్రభుత్వం తీవ్ర నిర్బంధం చేయడం వంటి సంఘటనల నుంచి ఉద్యమంలోకి వెళ్లి మార్పు కోసం శక్తి మేరకు పాటుపడ్డట్లు చెప్పారు. చాలామంది రానున్న రోజుల్లో పార్టీలలో చేరడం గురించి ఆలోచిస్తున్నారని, పరిస్థితిని బట్టి ప్రజలను చైతన్యం చేస్తూ మార్పు కోసం పనిచేస్తానని అన్నారు. నర్సింగాపూర్‌లో సర్పంచ్ ఎన్నిక జరిగిన విధానం గురించి మాట్లాడారు. నేటి యువత సంఘటితంగా ఆలోచించి అనుకున్నది సాధించాలన్నారు. సమాజ మార్పు కోసం అందరికీ మంచి జరిగేందుకు ప్రజలందరితో కలిసి ముందుకు వెళతానన్నారు. ఆయన వెంట లొంగిపోయిన సభ్యులు వెంకటేష్, పద్మ, రనిత, వేణు, భాస్కర్, శ్యామ్, పవన్, వికాస్‌లు ఉన్నారు. కార్యక్రమంలో జల వనరుల సంస్థ మాజీ చైర్మన్ వీరమల్ల ప్రకాష్ రావు, మాజీ పీఏసీఎస్ చైర్మన్ ఎర్రబెల్లి గోపాల్‌రావు, గ్రామ పెద్దలు సూర్యనేని మురళీధర్ రావు, తౌట్ రెడ్డి మల్లారెడ్డి, భాస్కరరావు, ఎర్రబెల్లి సుధాకర్ రావు, గొర్రె ఓదెలు, అల్లం ఓదెలు యాదవ్, కొమురయ్య, రేపాల సత్యనారాయణ తదితరులు ఉన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *