– అప్పుడే సుపరిపాలన సాధ్యం
– బయటి ఒత్తిళ్లకంటే అంతర్గత బలహీనతలే ప్రమాదం
– యువ సివిల్ సరెంట్లకు మంత్రి శ్రీధర్‌బాబు దిశానిర్దేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 18: ఈ దేశం మీ నుంచి పర్ఫెక్షన్ మాత్రమే ఆశించడం లేదు.. అంతకంటే ఎక్కువగా మీరు చేసే పనిలో సిన్సియారిటీని కూడా కోరుకుంటోంది అని యువ సివిల్ సర్వెంట్లకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు దిశానిర్దేశం చేశారు. జూబ్లీహిల్స్‌లోని డాక్టరు ఎంసీఆర్ హెచ్‌ఆర్డీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ తెలంగాణలో గురువారం నిర్వహించిన ‘స్పెషల్ ఫౌండేషన్ కోర్స్ ఫర్ ఏఐఎస్ అండ్ సీసీఎస్ ఆఫీసర్స్-2025’ ముగింపు వేడుకలకు ఆయన విశిష్ఠ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాసేవలో బాహ్య ఒత్తిళ్ల కంటే అంతర్గత బలహీనతలే ప్రమాదకరమన్నారు. గవర్నెన్స్ అంటే కేవలం ఫైళ్లు, నిబంధనలు కాదని, అది ప్రజలతో మమేకమయ్యే ఒక హ్యూమన్ రిలేషన్ అని చెప్పారు. అధికారం, హోదా, ప్రొటోకాల్స్ అన్నీ తాత్కాలికమని.. ప్రజల జీవితాల్లో మీరు తీసుకొచ్చే సానుకూల మార్పు మాత్రమే శాశ్వతమని అన్నారు. నిర్ణయాలు తీసుకునే సమయంలో సమాజంలోని చిట్టచివరి వ్యక్తిని, నిరుపేదల ప్రయోజనాలనూ పరిగణనలోకి తీసుకోవాలని, అప్పుడే అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందరికీ అందుతాయని ఆయన తెలిపారు. కార్యాలయాలకు మాత్రమే పరిమితం కాకుండా నిత్యం ప్రజలతో మమేకం కావాలని ఉద్బోధించారు. ప్రజా సేవలో బాహ్య ఒత్తిళ్ల కంటే అహంకారం, ఉదాసీనత, అవినీతి వంటి అంతర్గత బలహీనతలే ప్రమాదకరమని హెచ్చరించారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ స్వీయ నియంత్రణ పాటిస్తూనే నిజాయతీ, వినమ్రత, ధైర్యం కోల్పోకూడదని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో పౌర సేవలు ప్రజల ముంగిటకు చేరాలంటే టెక్నాలజీ వినియోగం అత్యవసరమన్నారు. అయితే ఆ సాంకేతికత ప్రజలకు చేరువగా ఉండాలి కానీ వారిని భయపెట్టేలా ఉండొద్దన్నారు. పాలనలో ప్రజల భాగస్వామ్యం పెరిగినప్పుడే ‘గుడ్ గవర్నెన్స్’ సాధ్యమవుతుందని, ఆ దిశగా చిత్తశుద్ధితో కృషి చేయాలని యువ అధికారులకు మంత్రి శ్రీధర్‌బాబు సూచించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





