– 6న పిప్పిరిలో ముఖ్యమంత్రి బహిరంగ సభ
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 28: ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గత శాసనసభ ఎన్నికల ముందు చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు మూడేళ్లు పూర్తి అయ్యాయి. 99 రోజుల ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా బోథ్ నియోజకవర్గం పిప్పిరిలో ఏప్రిల్ 6వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి పాల్గొనే బహిరంగ సభ ఏర్పాట్లపై ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల కలెక్టర్లు, రాష్ట్ర ఉన్నత అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శనివారం సమీక్షించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మాట ఇస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా నెరవేరుస్తుందని చెప్పానని, పిప్పిరిలో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేసే పత్రాలను ప్రజలకు అందిస్తామని చెప్పారు. అధికారులు సమన్వయం చేసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనే బహిరంగ సభకు తగు ఏర్పాట్లు చేయాలని దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రేమ్‌సాగర్ రావు, వెడమ బొజ్జు, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల కలెక్టర్లు, రాష్ట్ర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





