– అంతా డైవర్షన్ ప్లాన్ డ్రామా
– ప్రజల దరఖాస్తులు చెత్తబుట్టల్లోకి
– రెండున్నరేళ్లలో మీరు చేసిందేమిటి?
– బీఆర్ఎస్ నేత హరీష్‌రావు ప్రశ్న
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 6: కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల యాక్షన్ ప్లాన్ కేవలం దండగ ప్రచార పర్వం తప్ప మరొకటి కాదు. 800 రోజుల పాలనలో చేసిందేం లేక 99 రోజు ప్రణాళిక పేరిట మరో డ్రామాకు రేవంద్‌రెడ్డి తెరతీసిండని బీఆర్ఎస్ నేత హరీష్‌రావు విమర్శించారు. రెండున్నరేండ్ల పాలన తర్వాత ప్రగతి ప్రణాళికలు గుర్తుకు వచ్చాయా అని ప్రశ్నించారు. అమలుకు నోచుకోని ఆరు గ్యారెంటీలు, పాలన వైఫల్యాలు, కోట్లు కొల్లగొట్టేందుకు చేసిన స్కాంలు, ప్రజల ఛీత్కారాల నుంచి దృష్టి మరల్చేందుకు ప్రభుత్వం చేస్తున్న మరో డైవర్షన్ ప్లాన్ ఇది అన్నారు. గతంలో రెండుసార్లు నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభల్లో ప్రజల నుంచి తీసుకున్న లక్షలాది దరఖాస్తులు పరిష్కారం కాక ఇంకా చెత్తబుట్టల్లోనే మగ్గుతున్నాయి. ఆ దరఖాస్తులకు దిక్కు లేదు కానీ, మళ్లీ ఇప్పుడు పది వారాలపాటు పది రకాల నాటకాలతో ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దం కావడం సిగ్గు చేటు అన్నారు. రెండున్నరేండ్లలో ఏం చేశారని ప్రచారం నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించి మీ పైఫల్యాలు చెప్పుకుంటారా? కోతల సమయం వచ్చినా ఈ సీజన్ ఇప్పటివరకు రైతు భరోసా దిక్కు లేదు గత సీజన్ పంట బోనస్ ఇవ్వక చేతులెత్తేశారు.. చివరకు యూరియా కూడా సరఫరా చేయలేక రైతులను నడిరోడ్డు మీదకు ఈడ్చారు. నమ్మించి గొంతు కోసిన ఈ మోసాల గురించి రైతులకు వివరిస్తారా? మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అని ఊదరగొట్టి, అధికారంలోకి వచ్చాక యువతను మోసం చేశారు. జాబ్ క్యాలెండర్ జాబ్ లెస్ క్యాలెండర్ చేశారు. నోటిఫికేషన్లు ఇవ్వకుండా మూసీ బ్యుటిఫికేషన్ పేరిట లూటీకి తెగబడ్డారు. రాజీవ్ యువ వికాసం పేరిట తీసుకున్న దరఖాస్తులు దిక్కు లేకుండా పోయాయి. ఇప్పుడు యువతకు నైపుణ్య శిక్షణ కార్యక్రమం అంటూ కొత్త పాట పాడుతున్నారు. నిరుద్యోగులను ఎలా మోసం చేశారో వివరిస్తారా రేవంత్ రెడ్డి.. వారం వారం ఆరోగ్య రంగం, విద్యా రంగం, గ్రామీణాభివృద్ది అంటూ పేర్లు పెట్టి హాస్పిటల్స్‌లో కనీసం మందుల్లేవని, బడుల్లో కనీస వసతులు కరవయ్యాయని, గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసిందని ఒప్పుకున్నారు. ప్రభుత్వ ఆఫీసుల్లో పారిశుధ్యం, పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్ అనేది ప్రభుత్వ కనీస బాధ్యత కానీ, దానికి కూడా ఒక ఈవెంట్ లాగా కలర్ ఇవ్వడం ఈ ప్రభుత్వానికే చెల్లిందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందిన కొద్దిమందిని చూపిస్తామని గొప్పలు చెబుతున్న మంత్రులు.. అందని గ్యారెంటీల కోసం ఎదురుచూస్తున్న లక్షల మంది బాధితుల సంగతేంటో చెప్పాలి. సోలార్ విద్యుత్, పర్యావరణం, డ్రగ్స్ అడ్డుకట్ట లాంటివన్నీ పత్రికల్లో పబ్లిసిటీ ఇచ్చుకునేందుకు పెట్టుకున్న పేర్లు తప్ప, ఇందులో ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. మీ పాలనలో సగం కాలం పూర్తి కావస్తున్నది. ఇంకా ఎన్ని రోజులు ఇలా ప్రచారాలతో ప్రజలను మభ్యపెడతారు? పాలన గాలికి వదిలి పబ్లిసిటీ పేరిట చేస్తున్న మీ గారడీలను ప్రజలందరూ గమనిస్తున్నారు. సంక్షేమం, అభివృద్దిని గాలికి వదలి ప్రజా పాలన మాటున కొనసాగిస్తున్న దుర్మార్గపు పాలనను నిలదీసేందుకు గ్రామగ్రామాన ప్రజలు సిద్దంగా వున్నారన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




