– పోస్టుమాస్టర్లకు 5G మొబైల్ ఫోన్ల అందజేత
– ఇకపై పారదర్శకంగా, వేగవంతంగా పంపిణీ
– కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన మంత్రి సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 29: చేయూత సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీలో ఇప్పటివరకు పింఛన్‌దారుల ధ్రువీకరణ కోసం 2జీ ఆధారిత ఫింగర్ ప్రింట్ పరికరాలను వినియోగిస్తుండగా వాటి స్థానంలో ఆధునిక సాంకేతికతతో కూడిన ఆధార్ ఆధారిత ముఖ గుర్తింపు సాఫ్ట్‌వేర్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా ఈ పథకం డిజిటల్ రూపాంతరం చెందడం ద్వారా పింఛన్ పంపిణీలో పారదర్శకత, వేగం పెరిగి పింఛన్‌దారులకు సత్వర సేవలు అందుతాయని మంత్రి సీతక్క ప్రకటించారు. ఈ కొత్త విధానం ద్వారా సరైన వ్యక్తికి సరైన పింఛన్, సరైన సమయంలో అందేలా పింఛన్ పంపిణీ మరింత ఖచ్చితంగా, పారదర్శకంగా మారనుంది. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం రూ.15.50 కోట్ల బడ్జెట్‌తో 5జీ ఆధారిత ఎల్-1 ఫింగర్ ప్రింట్ పరికరాలు, కొత్త మొబైల్ ఫోన్లను కొనుగోలు చేసింది. కొన్ని జిల్లాల్లో ఈ పరికరాలను ప్రభుత్వం ప్రయోగాత్మకంగా వినియోగించగా ఆశించిన ఫలితాలు రావడంతో రాష్ట్రవ్యాప్తంగా 6,300 బ్రాంచ్ పోస్టుమాస్టర్లకు స్మార్ట్ మొబైల్ ఫోన్లు, పరికరాలు పంపిణీ చేయనున్నారు. వీటి పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి సీతక్క ములుగు జిల్లాలోని పస్రా కేంద్రంలో ములుగు జిల్లా కలెక్టర్ టి.ఎస్.దివాకర్‌తో కలిసి శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. కొద్ది రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 6,300 మంది పోస్టుమాస్టర్లకు ఈ పరికరాలను అందజేయనున్నారు. ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్‌ను టీజీ ఆన్‌లైన్ ప్రత్యేకంగా అభివృద్ధి చేసింది. కొత్త సాంకేతికత వల్ల పింఛన్‌దారుల ధ్రువీకరణ సమయం మూడు సెకన్లకు తగ్గి పింఛన్లు వేగంగా పంపిణీ అవుతాయి. ముఖ్యంగా వ్యవసాయ కూలీలు, వృద్ధులు, వేలిముద్రలు చెరిగిన వంటి వారికి ఈ యాప్ ఎంతో ఉపకరిస్తుంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





