మంజూరు ఫైల్ పై సంతకం చేసిన మంత్రి సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 21: వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న డయాలసిస్ పేషంట్లను ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా గుర్తిస్తున్న ప్రభుత్వం వారికి చేయూత పెన్షన్లు అందిస్తోంది. ఈ క్రమంలో ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కొత్తగా గుర్తించిన 681 మందికి ‘సెర్ప్’ ద్వారా పెన్షన్లను మంజూరు చేసింది. వీరిలో అత్యధికంగా హైదరాబాదులో 629 మంది చికిత్స పొందుతున్నారు. మిగిలిన జిల్లాల్లో 52 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. వీరు పూర్తిస్థాయిలో పనిచేసుకోలేకపోవడంతో వారి ఆరోగ్య, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేసింది. వచ్చే నెల నుంచి వీరు పెన్షన్ అందుకోనున్నారు. ఈమేరకు పెన్షన్ మంజూరు ఫైల్‌పై మహిళా శిశు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క సంతకం చేశారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాకముందు 4011 మంది డయాలసిస్ పేషెంట్లకు సామాజిక పెన్షన్లు మంజూరు కాగా, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత 4029 మంచి డయాలసిస్ పేషెంట్లకు చేయూత పెన్షన్ల మంజూరు చేసింది.



