పెండింగ్ డీఏల చెల్లింపు ఎపుడో?

– ఉప ముఖ్యమంత్రిని నిలదీసిన హరీష్‌రావు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 23: ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఏకంగా ఐదు డీఏలు పెండింగ్‌లో పెట్టారు.. వాటిని ఎప్పట్లోగా చెల్లిస్తారో మంత్రి సూటిగా సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి.హరీష్‌రావు అసెంబ్లీలో ఉద్యోగుల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డు ఉద్యోగుల సమస్యలపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. ఉప ముఖ్యమంత్రి తన ప్రశ్నలకు సమాధానం దాటవేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. పీఆర్సీ కమిటీకి మార్చి 31 వరకు పొడిగింపు ఇచ్చారు. ఆ గడువు ముగియడానికి ఇంకో వారం, ఎనిమిది రోజులు మాత్రమే ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోగా కొత్త పీఆర్సీ ఇస్తామని ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు కావస్తున్నా పీఆర్సీ లేదు.. మళ్లీ గడువు పొడిగిస్తారా? కనీసం ఇప్పుడైనా నివేదిక తీసుకుని ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ఎప్పటిలోగా ఇస్తారో స్పష్టంగా చెప్పాలని అడిగారు. గతంలో కేసీఆర్ ఐఆర్ ఇచ్చి ఆదుకున్నారు, మీరైనా ఐఆర్ పెంచి ఉద్యోగులకు రిలీఫ్ ఇస్తారా లేదా అని నిలదీశారు. 30, 35 ఏళ్లపాటు ప్రభుత్వం కోసం పనిచేసిన రిటైర్డు ఉద్యోగుల వెతలు అంతాఇంతా కాదు.. జీవిత చరమాంకంలో వైద్యం అందక, పిల్లల పెళ్లిళ్లు చేయలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. అసలు రాష్ట్రంలో ఎంతమంది రిటైర్ అయ్యారు.. వాళ్లకు చెల్లించాల్సిన బెనిఫిట్స్ ఎంత.. ఇప్పటివరకు ప్రభుత్వం ఎంత చెల్లించింది.. మిగతా బకాయిలు ఎప్పట్లోగా చెల్లిస్తారో మంత్రి చెప్పాలన్నారు. రిటైర్మెంట్ తర్వాత ప్రశాంతంగా జీవితం గడపాల్సిన ఉద్యోగులు తమ బకాయిల కోసం సెక్రటేరియట్ చుట్టూ, మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ రోజూ తిరుగుతున్నారు.. ఇవాళ రోడ్ల మీద కూర్చుని ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.. రిటైర్డ్ ఉద్యోగులకు డబ్బులు ఇవ్వడానికి మీ దగ్గర నిధులు లేవా లేక మనసు లేదా అనేది అర్థం కావడం లేదు అని వ్యంగ్యంగా అన్నారు. ఫ్యూచర్ సిటీకి రూ.లక్ష కోట్లు.. మూసీకి రూ.లక్ష కోట్లు ఉన్నాయి అంటారు.. అందాల పోటీలకు, ఫుట్‌బాల్ షోలకు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి.. ముఖ్యమంత్రి రూ.వంద కోట్లతో క్యాంప్ ఆఫీస్ కట్టుకుంటారు.. భట్టి మూడో క్యాంప్ ఆఫీస్ కట్టుకుంటారు.. వాటన్నిటికీ డబ్బులు ఉంటాయి కానీ ఉద్యోగుల పీఆర్సీ, డీఏలకు డబ్బులు లేవంటారు అని హరీష్‌రావు ఎద్దేవా చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *