మంత్రి అడ్లూరి లక్ష్మణ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 1: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ రెసిడెన్షియల్, హాస్టల్స్‌కు సంబంధించి డైట్, రెంటల్ సహా అన్ని పెండింగ్ బిల్లులను క్లియర్ చేశామని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విలేకరులకు తెలిపారు. తన పరిధిలోని శాఖల అధికారుల నుంచి అన్ని అంశాలపై సమాచారం తీసుకుంటున్నానంటూ విద్యార్థులకు యూనిఫామ్, పుస్తకాలు, బూట్లకు సంబంధించి త్వరలోనే టెండర్లు పిలుస్తామన్నారు. గత పదేళ్లపాటు అధికారంలో ఉన్న వారు చేసినట్లు తాము చేయడం లేదన్నారు. అన్ని ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలో 25శాతం సీట్లు ఎస్సీ, ఎస్టీలకు ఇవ్వాలని ఆయా స్కూళ్ల యజమానులను ఆదేశించారు. ప్రతి నలా హాస్టల్ భవనాల అద్దె చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆర్ధిక మంత్రిని కోరానన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రతీ నియోజకవర్గంలో రెండు మూడేళ్లలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రారంభిస్తామని, డైట్, కాస్మోటిక్ చార్జెస్ పెంచిన మొత్తమే చెల్లిస్తున్నామని, సంక్షేమ, గురుకుల పాఠశాలల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని వివరించారు. రాబోయే రోజుల్లో విద్యార్థులకు యూనిఫామ్స్ విషయంలో ఆలస్యం జరగకుండా చూస్తామన్నారు. గురుకులాల్లో ఆత్మహత్యలు జరగడానికి అనేక కారణాలున్నాయంటూ సోషల్ మీడియా, కుటుంబంలో పరిస్థితులు కారణాలని, వాటిని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.





