గ్రామీణ పేదల కడుపు కొడుతున్న పెండింగ్ బిల్లులు

– బడ్జెట్‌లో బీజేపీ ప్రభుత్వం భారీ కోతలు
– డిమాండ్‌కు తగ్గట్టు పనులు కల్పించడంలో విఫలం
– కాంగ్రెస్ సీనియ‌ర్ నేత, ‘కుడా’ చైర్మ‌న్ ఇనుగాల

హనుమకొండ, ప్రజాతంత్ర, జనవరి 9: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద దేశవ్యాప్తంగా రూ.10 వేల కోట్లకు పైగా బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో గ్రామీణ పేదల జీవనం తీవ్రంగా ప్రభావితమవుతోందని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, ‘కుడా’ చైర్మ‌న్ ఇనుగాల వెంక‌ట్రామిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. హనుమకొండ డీసీసీ భవన్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు, ఎమ్మెల్సీ  బస్వరాజు సారయ్య హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా వెంక‌ట్రామ్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి బడ్జెట్‌లో నిధుల మంజూరు భారీగా కోతలు విధిస్తోంది. దీనివల్ల హన్మకొండ జిల్లాలోని వేలాదిమంది కూలీలకు పని దొరకడం గగనమైంది. జిల్లాలో డిమాండ్‌కు తగ్గట్టుగా  పని దినాలు కల్పించడంలో కేంద్రం విఫలమైంది. హన్మకొండ జిల్లాలో కొన్ని నెలలుగా ఉపాధి హామీ కూలీలకు రావాల్సిన వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఉపాధి హామీ వెబ్‌సైట్ గణాంకాల ప్రకారం వేతనాల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. కష్టపడి పనిచేసిన కూలీలకు సకాలంలో డబ్బులు ఇవ్వకపోవడం వల్ల వారు అప్పులపాలవుతున్నారు. పండగలు, అవసరాలకు పైసలు లేక ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో ఉపాధి హామీ నిధులతో చేపట్టిన సిమెంట్ రోడ్లు, వైకుంఠధామాలు, కల్వర్టుల వంటి పనులకు సంబంధించి మెటీరియల్ బిల్లులు కోట్ల రూపాయల్లో పెండింగ్‌లో ఉన్నాయి. దీనివల్ల గ్రామాల్లో అభివృద్ధి పనులు ఆగిపోవడమే కాకుండా, పనులు చేసిన చిన్నపాటి కాంట్రాక్టర్లు ఆర్థికంగా చితికిపోతున్నారు.

యాప్ పేరుతో కొర్రీలు

డిజిటల్ అటెండెన్స్ ( ఎన్ఎంఎంఎస్ యాప్ ) పేరుతో కేంద్రం కొత్త నిబంధనలు పెట్టి పేద కూలీల పొట్ట కొడుతోంది. హన్మకొండ జిల్లాలో సిగ్నల్ సమస్యలు ఉన్న ప్రాంతాల్లో కూలీలు పని చేసినా, హాజరు పడక వేతనాలు కోల్పోతున్నారు. సాంకేతికతను సాకుగా చూపి కూలీలను తగ్గించే బీజేపీ కుట్ర చేస్తోంది. తెలంగాణపై, ముఖ్యంగా హన్మకొండ వంటి జిల్లాలపై కేంద్రం వివక్ష చూపుతోంది. రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను విడుదల చేయకుండా రాజకీయాలు చేస్తోంద‌ని ఇనుగాల వెంక‌ట్రామ్‌రెడ్డి విమర్శించారు. హన్మకొండ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అన్ని వేతన బకాయిలను తక్షణమే విడుదల చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. మెటీరియల్ బిల్లులను చెల్లించి ఆగిపోయిన అభివృద్ధి పనులను పూర్తి చేయాల‌న్నారు.  సంవత్సరానికి 100 రోజుల పనిని 150 రోజులకు పెంచాలి. ఫీల్డ్ అసిస్టెంట్లకు, కూలీలకు ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందులను తొలగించాలి. పేదల పొట్ట కొడుతున్న బీజేపీ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. ఉపాధి హామీ కూలీల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుంద‌ని వెంక‌ట్రామ్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు, ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *