సూప్‌లూ సలాడ్‌లతో
రోజు మొదలైంది
పప్పలు తిన్నాడు
పప్పులూ తిన్నాడు
పానకాలు తాగాడు
పాయసాలూ తాగాడు
పాలు తాగాడు
పళ్ళ రసాలూ తాగాడు
బూరెలు తిన్నాడు గారెలూ తిన్నాడు
పదహారు పచ్చళ్ళు యిరవైయ్యారు యిగురు కూరలూ తిన్నాడు
ముప్పైయ్యారు కాయగూరలు అరవైయ్యారు
ఆకుకూరలూ తిన్నాడు
రకరకాల పొడులు వేసుకున్నాడు
జారుగా నెయ్యినీ కలుపుకున్నాడు
డ్రై ఫ్రూట్సే కాదు డ్రై ఫిష్షూ వదల్లేదు
ఫిష్ష్‌ అంటే గుర్తొచ్చింది, చేపా జెల్లా తిన్నాడు
కోడీ మేకా తిన్నాడు బోటీ తలకాయ కూరా
ముద్దపప్పూ రసమూ పులుసూ సాంబారూ లేనిది లేదు
పిజ్జాలు బర్గర్లూ కోక్‌లూ
దానిమ్మగింజలు జీడిపప్పులు కలిపిన కర్డ్‌రైస్‌లో
నంజుకి వుప్పు మిరపగాయలూ
నిమ్మ దబ్బ ఆవకాయ మాగాయ
మహాపచ్చళ్ళు అంచున తగిలించి
రైతాలు సలన్‌లు సరే సరి
కేకులూ డబల్‌ కా మీటాలూ ఫ్లావర్ల ఐస్‌ క్రీములూ
ఆవుపాల కోవాలు జాంగ్రీలు బాలుసాలు బాదంపాలూ
తాంబూల సేవనంగా కిల్లీ మిఠాయి పాన్లూ మసాలాజర్దాలూ
రాజులా తిన్నాడు, తేన్చాడు.
ఘనమైనవన్నీ తిన్నా పిత్తెందుకో కంపేగొట్టింది!
ఇన్ని తిన్నా పొద్దున్న మలమే అయ్యింది!
తను పక్కవాడికి పెడితే మాత్రం ప్రసాదమయ్యింది
ఆకలి తీరింది.

-బమ్మిడి జగదీశ్వరరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *