ఇస్లామాబాద్‌లో రేపు శాంతి చర్చలు

– రెడ్ అలర్ట్ ప్రకటించిన పాక్
– భారీగా బందోబస్తు ఏర్పాటు

ఇస్లామాబాద్, ఏప్రిల్ 10: అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణకు అంగీకరించినా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మాత్రం తొలగిపోలేదు. సీజ్‌ఫైర్ వేళ శాంతి చర్చలకు పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది. ఇస్లామాబాద్‌లో శనివారం ఈ చర్చలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ హై అలర్ట్‌లోకి వెళ్లిపోయింది. ప్రభుత్వ భవనాలు, కీలక రహదారి మార్గాల వద్ద భద్రతా బలగాలు పహారా కాస్తున్నాయి. రాజధానిలోని రెడ్‌జోన్ చుట్టూ కట్టుదిట్టమైన భద్రత కొనసాగుతోంది. అక్కడ పరిమిత సంఖ్యలోనే జనసంచారం కనిపిస్తోంది. ఇస్లామాబాద్‌లో దేశ పార్లమెంట్, కీలక ప్రభుత్వ కార్యాలయాలు, లగ్జరీ హోటళ్లు, ఎంబసీలు, విదేశీ సంస్థల కార్యాలయాలున్న ప్రాంతాన్ని రెడ్ జోన్‌గా పిలుస్తారు. ఈ చర్చల నేపథ్యంలో గురు, శుక్రవారాలు ఇస్లామాబాద్‌లో సెలవు ప్రకటించారు. దుకాణాలు మూతపడ్డాయి. తమ మధ్యవర్తిత్వంతోనే రెండు వారాలపాటు కాల్పుల విరమణ జరిగిందని చెప్పిన పాకిస్థాన్ ఇప్పుడు ఇరు దేశాల మధ్య శాంతి చర్చలకు ఆతిథ్యం ఇస్తోంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని బృందం చర్చల్లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఇక ఇరాన్ వైపు నుంచి విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ, పార్లమెంట్ స్పీకర్ ఘాలిబాఫ్ పాక్ బయల్దేరారంటూ అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే ఈ వార్తలను ఇరాన్ ఖండించింది. వారిద్దరూ తమ రాజధాని టెహ్రాన్‌లోనే ఉన్నారని చెప్పింది. ఒకవేళ చర్చలంటూ జరిగితే హర్మూజ్‌పై నియంత్రణ, తమ దేశంపై ఉన్న ఆంక్షల నుంచి ఉపశమనం, తన మిత్రపక్షాలపై దాడులు చేయకూడదంటూ 10 పాయింట్ల డిమాండ్లపైనే ఇరాన్ పట్టుబట్టే అవకాశం ఉంది. ఇక లెబనాన్‌లోని ఇరాన్ మిత్రపక్షం హెజ్‌బొల్లా గ్రూప్‌పై ఇజ్రాయెల్ దాడులు మాత్రం ఆగడం లేదు. సీజ్‌ఫైర్ ప్రకటన తర్వాతే అక్కడ మారణహోమం సృష్టించింది. అమెరికా-ఇరాన్ మధ్య ఉన్న అపనమ్మకం, ఇజ్రాయెల్ దూకుడు కారణంగా ఈ చర్చల్లో పురోగతిని ఆశించలేమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *