– ‘చెలిమి’ కన్వీనర్ రవీందర్ డిమాండ్
– శృతి పదేళ్ల యాది సభ
కాళోజీ జంక్షన్/హన్మకొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 14: కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ నిలిపివేసి మావోయిస్టులతో బేషరతుగా శాంతి చర్చలు జరపాలని చెలిమి సాహిత్య, సాంస్కృతిక వేదిక కన్వీనర్ మెట్టు రవీందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హన్మకొండ వడ్డేపల్లిలో ఆదివారం జరిగిన తంగెళ్ల శృతి పదేళ్ల యాది సభకు తండ్రి తంగెళ్ల సుదర్శనం అధ్యక్షత వహించగా రవీందర్ ప్రధాన వక్తగా మాట్లాడారు. యువత సాయుధ పోరాటాన్ని ఎందుకు ఎంచుకుంటున్నదో ప్రభుత్వం ఆలోచించాలని హితవు పలికారు. సమాజంలోని అసమానతలు, అవినీతిని నిర్మూలించకుండా ఉద్యమకారులను హతమార్చడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఆదివాసీలపై జరుపుతున్న అమానుష మారణకాండను పౌర సమాజం, ప్రజాప్రతినిధులు వ్యతిరేకించాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో తమ కలలు నెరవేరుతాయని ఆశించిన యువతకు ఫలితం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడిన తొలి ఏడాదిలోనే తంగెళ్ల శృతి, సాగర్‌లను తెలంగాణ ప్రభుత్వం బూటకపు ఎన్‌కౌంటర్‌లో హతమార్చిందని ఆరోపించారు. రాజకీయ పార్టీల నియంతృత్వ విధానాలను ప్రజలు తిరస్కరిస్తారని, కేంద్రం ఫాసిస్టు విధానాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. కేంద్రం మావోయిస్టులపై డెడ్‌లైన్లతో సాధించేదేమీ లేదని రవీందర్ హితవు పలికారు. దేశంలో ఈశాన్య రాష్ట్రాల పలు సాయిధ సంస్థలతో చర్చలు జరిపిన ఎన్డీయే ప్రభుత్వం మావోయిస్టులతో శాంతి చర్చలు జరపడానికి ఇబ్బందులేమిటని ప్రశ్నించారు. మావోయిస్టులు కాల్పుల విరమణ ప్రకటించినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం మావోయిస్టులతో శాంతి చర్చలకు ప్రక్రియ ప్రారంభించాలని కోరారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్లు తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విరసం ఉమ్మడి జిల్లా కన్వీనర్ కోడం కుమారస్వామి మాట్లాడుతూ సమాజంలోని వివిధ సమస్యలకు పరిష్కారాలు చూపడంలో పాలకులు విఫలమయ్యారని ఆరోపించారు. దేశంలో పాలకులు అజ్ఞానం, అవినీతిని పెంచి పోషిస్తున్నారని విమర్శించారు. ఉపాధ్యాయుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సమసమాజం కోసం స్వప్నించిన అమరుల త్యాగాలు ఊరికే పోవన్నారు. కవి సిల్వర్ అశోక్ కవితను చదివారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు డాక్టర్ ఎం.గంగాధర్, శృతి కుటుంబ సభ్యుడు గోవర్ధన్, శాంతి చర్చల ప్రతినిధి వేకువ దుర్గాప్రసాద్, కవులు ఆదిరెడ్డి, శాఖమూరి రవి, చిలువేరు అశోక్, అమరుల బంధుమిత్రుల సంఘం జిల్లా నాయకులు భారతక్క, ఊర్మిళ, తెలంగాణ ప్రజాఫ్రంట్ ప్రతినిధి బి.రమాదేవి, పార్వతి, వివేక్ తల్లిదండ్రులు మాధవి, యోగానంద్, కామ్రేడ్ రాకేష్ తల్లి, బంధువులు, మిత్రులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





