50శాతం పరిమితి ఎత్తివేయకుండా అడ్డంకి

– బీజేపీ తీరుపై మండిపడ్డ పీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌

యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, ఆగస్టు 4: రిజర్వేషన్లపై 50 శాతం క్యాప్‌(పరిమితి)ని ఎత్తేసేందుకు కేంద్ర ప్రభుత్వం అడ్డుపడుతోందని పీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో బీసీ రిజర్వేషన్ల అంశంపై మాట్లాడిన ఆయన బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రిజర్వేషన్‌ బిల్లు గవర్నర్‌ ద్వారా కేంద్రానికి పంపించామని, కానీ కేంద్రం అడ్డుపడుతోందని అన్నారు. బీసీల పట్ల బీజేపీకి ప్రేమ లేదని, మొదటి నుంచి బీసీ రిజర్వేషన్లపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి బాహాటంగానే వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల పట్ల ఎందుకుకు వివక్ష అని కిషన్‌ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తున్నాన్నారు. ముస్లింలను సాకుగా చూపించి బీసీ బిల్లును అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం ఉందని.. ఇక్కడ మెలిక పెడుతున్నవళ్లు అక్కడ ఎలా అమలు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కావాలని 6వ తేదీన దిల్లీలో జంతర్‌మంతర్‌ వద్ద ముఖ్యమంత్రి సహా అందరూ ధర్నా చేస్తున్నట్లు తెలిపారు. బీసీ రిజర్వేషన్ల బిల్లు సాధనకు 1200 మంది నాయకులు రైలు ద్వారా దిల్లీ వెళుతున్నారన్నారు. వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్‌, పీసీసీ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌తో కలిసి చర్లపల్లి నుంచి ఆలేరు వరకు రైలులో ప్రయాణం చేసినట్లు చెప్పారు. బీసీ రిజర్వేషన్ల బిల్లు యావత్‌ దేశానికి తెలంగాణ రోల్‌ మోడల్‌గా మారిందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *