– కమిషన్ విచారణలో అదే తేలింది
– సొంత లాభం కోసం రూ.లక్ష కోట్లు వృధా చేశారు
– అందుకు మూల్చం చెల్లించక తప్పదు
– పీసీసీ చీఫ్ మహేష్ కుమార్
సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఆగస్టు 2: బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ దోషి అని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ చెప్పిందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రూ.లక్షల కోట్లు వృథా చేసి తెలంగాణను కేసీఆర్ అప్పులపాలు చేశారని కమిషన్ తేల్చి చెప్పిందన్నారు. ఇంజనీర్లు చెప్పింది కేసీఆర్ వినకుండా తన సొంత లాభం మాత్రమే చూసుకున్నారని విమర్శించారు. పాదయాత్రలో భాగంగా శనివారం ఆందోలు మండలం సంగుపేటలోని ఓ ఫంక్షన్ హాల్‌లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి విూనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి దామోదర రాజనర్సింహ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ తనకి ఇష్టం ఉన్నచోట కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాలని కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారని చెప్పుకొచ్చారు. రెండే పిల్లర్లు కుంగాయని బీఆర్‌ఎస్ నేతలు అంటున్నారని, ఇది సామాన్య విషయమా అని ప్రశ్నించారు. ఫార్ములా ఈ-కారు రేస్‌లో మాజీ మంత్రి కేటీఆర్ అవినీతికి పాల్పడలేదా అని నిలదీశారు. ప్రభుత్వ సొమ్ము తిన్నవాళ్లు కక్కక తప్పదని మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకున్న నియోజకవర్గాల్లో ఇబ్బందులున్నాయని, ప్రతిపక్షాల కుట్రల వల్ల వేరే పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకున్నామని తెలియజేశారు. కాంగ్రెస్‌లో గ్రూపులు సహజమంటూ ఎన్నికలపుడు అందరూ పార్టీ కోసం పోరాడాలని సూచించారు. గ్రూపుల వల్ల నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత తమది అని హావిూ ఇచ్చారు. బీఆర్‌ఎస్ చేతగానితనం వల్ల బనకచర్ల ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైందని మండిపడ్డారు. తమ ఫిర్యాదు వల్లే ఆ ప్రాజెక్టు పనులు ఆగాయని మహేశ్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు.




