బీఆర్‌ఎస్‌కు నూకలు చెల్లాయ్‌

వాటాల్లో తేడాలతోనే కేసీఆర్‌ కుటుంబంలో కల్లోలం
– ఆ పార్టీని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు
– టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌

న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 25: బీఆర్‌ఎస్‌ పార్టీకి రాష్ట్రంలో నూకలు చెల్లాయని, ఆ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌ గౌడ్‌ విమర్శించారు. వొచ్చే జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలవడం తథ్యమని ఆశాభావం వ్యక్తం చేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను వంతులవారీగా పంచుకున్నారని.. ఇప్పుడు వాటాల దగ్గర తేడా రావడంతో కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
జూబ్లీహిల్స్‌లో ఒక్క సామాజికవర్గానికే కాక అందరికీ సంక్షేమం, అభివృద్ధి అమలు చేస్తున్నామని తెలిపారు. జూబ్లీహిల్స్‌ ఎన్నికపై సర్వే చేస్తున్నామని, సర్వేలో ఎవరు ముందుంటే వారికే సీటు ఇస్తామని, గెలిచే వారికి సీటు ఇస్తామని స్పష్టం చేశారు. ఏడాది కాంగ్రెస్‌ పాలనలో రాష్ట్రాన్ని ఎంతగానో అభివృద్ధి చేశామని చెప్పుకొచ్చారు. దిల్లీలో మీడియాతో మహేష్‌ కుమార్‌ గౌడ్‌ గురువారం చిట్‌చాట్‌ చేశారు. జూబ్లీహిల్స్‌ ఎన్నికల్లో చాలామంది రేస్‌లో ఉన్నారన్నారు. సీఎన్‌ రెడ్డి, బాబా ఫసియుద్దీన్‌, నవీన్‌ యాదవ్‌, బొంతు రామ్మోహన్‌ సహ పలువురు టికెట్‌ అడుగుతున్నారని తెలిపారు. స్థానికులకు టికెట్‌ ఇవ్వాలనే డిమాండ్‌ ఉందన్నారు. మంత్రుల కమిటీ, సర్వే ఫలితాల ఆధారంగా నిర్ణయాలు ఉంటాయని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్‌ కూడా కాంగ్రెస్‌ ఖాతాలోకే వొస్తోందని చెప్పుకొచ్చారు. గతంలో కంటోన్మెంట్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచిందని గుర్తుచేశారు. గాంధీ భవన్‌లో మంత్రుల ముఖాముఖి కార్యక్రమం చాలా బాగా జరుగుతోందని చెప్పుకొచ్చారు. గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ అధ్యక్షతన తెలంగాణ డీసీసీల అంశంపై సమావేశం నిర్వహిస్తామని వెల్లడిరచారు. ఈ సమావేశానికి ఏఐసీసీ కొత్తగా ఎంపిక చేసిన 22 మంది అబ్జర్వర్లు హాజరవుతారని తెలిపారు. అక్టోబర్‌ 4న 22 మంది అబ్జర్వర్లు తెలంగాణలో పర్యటిస్తారని మహేష్‌ కుమార్‌ గౌడ్‌ పేర్కొన్నారు. హైడ్రాతో సామాన్యుడికి ఇబ్బంది లేదు. కబ్జా చేసిన వారికే ఇబ్బందులు. ప్రభుత్వ భూమి పోకుండా ఉండేలా హైడ్రా పని చేస్తుంది. సీఎం రేవంత్‌ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఇల్లు హైడ్రా కూలగొట్టడానికి వెళ్లింది, కానీ స్థానికులు కోర్టు ఆర్డర్‌ తీసుకొచ్చారు ..ఆగిపోయింది. తన, మన భేదం లేకుండా హైడ్రా పనిచేస్తోంది. బీఆర్‌ఎస్‌ పార్టీ నాలుగు ముక్కలు అయింది. పునర్జీవం పోసుకోదు. ఏం చూసి బీఆర్‌ఎస్‌ను ప్రజలు ఆదరిస్తారు. కేసీఆర్‌ ఫామ్‌ హౌస్‌కే పరిమితం అయ్యారు. బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి బీజేపీ నాయకులకు ఉంటే ఒక్క రోజులో బీసీ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపొచ్చు’ అని మహేష్‌ కుమార్‌ గౌడ్‌ పేర్కొన్నారు. గత కేసీఆర్‌ ప్రభుత్వంలో జరిగిన అవినీతి అన్నిటిపైన సీబీఐ విచారణ జరిపితే బాగుంటుంది. కవితది ఆస్తుల పంచాయితీ. కాంగ్రెస్‌తో కవితకు ఏలాంటి సంబంధం లేదు. కవితకు ప్రజల్లో ఏం ఇమేజ్‌ ఉంది ?. దోపిడీ చేసిన వారిని ప్రజలు ఎందుకు ఆదరిస్తారు. ఫోన్‌ ట్యాపింగ్‌ పెద్ద కేసు, అందరి వాయిస్‌లు రికార్డు చేశారు. నాది, రేవంత్‌రెడ్డిది రెండున్నరేళ్ల నుంచి గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఫోన్‌ ట్యాపింగ్‌ చేసింది. నేను వాడిన జియో సిమ్‌ కార్డు నెంబర్‌ జియో సంస్థకు గత కేసీఆర్‌ ప్రభుత్వం ఇచ్చింది. ఆ లేఖ కూడా దొరికింది. ఫోన్‌ ట్యాపింగ్‌ చేసి కేసీఆర్‌, కేటీఆర్‌ వ్యూహ రచన చేసి గత ఎన్నికల్లో గెలిచారు. ఫార్ములా ఈ -కారు రేసు కేసులో కేటీఆర్‌ అరెస్ట్‌ తప్పదు.. క్లియర్‌ ఆధారాలు ఉన్నాయి’ అని మహేష్‌ కుమార్‌ గౌడ్‌ పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *