ప్రభుత్వం చేతికి కాళేశ్వరం కమిషన్‌ నివేదిక

– నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్‌బొజ్జాకు అందజేసిన పీసీ ఘోష్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 31: కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై విచారణకు నియామకమైన పీసీ ఘోష్‌ కమిషన్‌ తన నివేదికను ప్రభుత్వానికి గురువారం అందజేసింది. జస్టిస్‌ పీసీ ఘోష్‌ బీఆర్‌కే భవన్‌కు వెళ్లి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్‌ బొజ్జాకు వెయ్యి పేజీల నివేదికను సీల్డ్‌ కవర్‌లో అందజేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు, అవినీతిపై 15 నెలలపాటు కమిషన్‌ విచారణ జరిపి 115మంది సాక్ష్యాలు నమోదు చేసింది. కెసిఆర్‌, ‌హరీష్‌ ‌రావు, ఈటల రాజేదర్‌ ‌సహా నీటిపారుదల శాఖ అధికారులను విచారించింది. జస్టిస్‌ ఘోష్‌. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించి పూర్తి విచారణ చేశారు. కమిషన్‌ అంసన నివేదికను రాహుల్‌ బొజ్జా రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి అందజేయనున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ 2023 చివరలో కుంగడం, పియర్స్‌ దెబ్బతినడంతోపాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో సీపేజీ సమస్యలు ఉత్పన్నమవడంతో 2023 డిసెంబరులో రాష్ట్రంలో మారిన కాంగ్రెస్‌ ప్రభుత్వం విజిలెన్స్‌ విచారణతోపాటు నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్‌ఏ)తో అధ్యయనం చేయించిన విషయం విదితమే. లోపాలు తీవ్రంగా ఉన్నట్లు విజిలెన్స్‌ ప్రాథమిక నివేదిక సమర్పించింది. అసెంబ్లీలో చర్చ సందర్భంగా న్యాయ విచారణకు ఆదేశిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించడంతోపాటు వెంటనే కమిషన్‌ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్చి 2024లో జస్టిస్‌ పీసీ ఘోష్‌ ఆధ్వర్యంలో కమిషన్‌ను ఏర్పాటు చేయగా మే నెల నుంచి కార్యకలాపాలు ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *