– తెలంగాణకు ఏనాడూ మద్దతు ఇవ్వని పవన్
- మండిపడ్డ జాగృతి అధ్యక్షురాలు కవిత
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 3: ఆంధప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్రంగా స్పందించారు. ఎల్బీనగర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆమె పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నాయని విమర్శించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తమ బిడ్డలు ప్రాణత్యాగాలు చేయగా పవన్ కళ్యాణ్ మాత్రం ఆనాటి నుంచి నేటి వరకు తెలంగాణకు వ్యతిరేకంగానే ఉన్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ తెలంగాణ నాయకుల దిష్టి కళ్లతో కోనసీమ పాడైందని అనడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కోనసీమ మాదిరిగా తెలంగాణ కావాలనుకున్నాం కానీ తెలంగాణ ప్రజలు ఏనాడూ దిష్టి పెట్టలేదన్నారు. తెలంగాణ బిడ్డల మనసు చాలా గొప్పది.. తాము పెద్దగా ఆలోచిస్తాం అని ఆమె అన్నారు. తమ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు అవుతున్నా ఎప్పుడు కూడా జై తెలంగాణ, జై ఆంధ్ర అనే తాము కోరుకున్నామని, తెలంగాణ ఎంత బాగుందో ఆంధ్రా కూడా అంతే బాగుండాలని ఆకాంక్షించామని స్పష్టం చేశారు. ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వాలని తాను పార్లమెంట్‌లో కూడా మాట్లాడానన్నారు. పక్కోడు బాగుంటే తమ కళ్లు మండవు. పక్కోనిది గుంజుకోవాలనుకునే వాళ్లం కాదు. తామూ బాగుండాలని కోరుకుంటాము కానీ పక్కోడు చెడిపోవాలని అనుకోం.. అలా అనుకుని ఉంటే తెలంగాణ ఉద్యమ స్వరూపం వేరేలా ఉండేది.. తమ బిడ్డలు ప్రాణాలు త్యాగం చేశారే తప్ప, ఒక్క పరాయి రాష్ట్రం వారి మీద కూడా చేయి ఎత్తలేదని కవిత స్పష్టం చేశారు. ఆనాడు సినిమా నటుడిగా మాట్లాడారు.. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అని.. ఆయన మాటలు ఆంధ్ర ప్రజలకు ఆపాదిస్తారని కవిత హెచ్చరించారు. కనుక పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలని సూచించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.