మెట్రో స్టేషన్‌లో పాస్‌పోర్టు సేవా కేంద్రం

– దేశంలోనే మొదటగా హైదరాబాద్‌లో ఏర్పాటు
– దీంతో ప్రజలకు మరింత చేరువగా సేవా కేంద్రం 
– ఎంపీలతో కలిసి ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 16: దేశంలోనే పాస్‌పోర్టు జారీలో తెలంగాణ రాష్ట్రం ఐదో స్థానంలో నిలిచిందని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ఎంజీబీఎస్‌ మెట్రో స్టేషన్‌లో నూతన పాస్‌పోర్టు సేవా కేంద్రాన్ని లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్‌ ఓవైసీ, రాజ్యసభ సభ్యుడు అనిల్‌ కుమార్‌ యాదవ్‌, ఎమ్మెల్సీ రియాజుల్‌ హసన్‌, జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మిలతో కలసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రభాకర్‌ మాట్లాడుతూ దేశంలోనే మెట్రో స్టేషన్‌లో ప్రారంభమైన మొదటి పాస్‌పోర్ట్‌ కేంద్రం ఎంజీబీఎస్‌ పాస్‌పోర్టు కార్యాలయమని తెలిపారు. రాష్ట్రంలో రోజుకు 4500 పాస్‌పోర్టులు ఇచ్చే సామర్థ్యం ఉందని తెలుపుతూ ఒక్కో కేంద్రం 750 నుండి 1200 స్లాట్స్‌కు సామర్థ్యం పెంచుకోవాలని సూచించారు. గుర్తింపు కోసం ఆధార్‌ కార్డు మాదిరి పతి ఒక్కరూ పాస్‌పోర్టు తీసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. గతంలో గల్ఫ్‌ దేశాలకు కార్మికులు వెళ్లేవారని, ఇప్పుడు విద్య, ఉపాధి అవకాశాలు నిమిత్తం వివిధ వర్గాలు విదేశాలకు వెళ్తున్నారని గుర్తు చేశారు. మెట్రో, బస్‌ స్టేషన్‌ల ద్వారా వివిధ జిల్లాల నుండి ఇక్కడికి వచ్చి పాస్‌పోర్టు తీసుకుపోవడానికి ఎంజీబీఎస్‌లో పాస్‌పోర్టు కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని, ఎక్కువ స్లాట్స్‌ బుక్‌ అయ్యే అవకాశం ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో ఎంజీబీఎస్‌లోనే పాస్‌పోర్టు తీసుకుంటాం అనేలా సిబ్బంది స్నేహితుల్లా వ్యవహరించాలని సూచించారు. ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ మాట్లాడుతూ హైదరాబాద్‌ పాత బస్తీ ప్రాంతంలో పాస్‌పోర్టు సేవా కేంద్రం ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. రాష్ట్రం నుండి విద్యావంతులు ఉన్నత చదువుల కోసం, ఉపాధి అవకాశాల కోసం ఎందరో వెళ్లే సందర్భాల్లో బస్టాండ్‌, మెట్రో స్టేషన్‌ అందుబాటులో ఉండటం సులభతరంగా ఉందన్నారు. రాజ్యసభ సభ్యుడు అనిల్‌ కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ ఇటీవల ప్రతి ఒక్కరికీి పాస్‌పోర్టు అవసరం పడుతున్నదని, ఈ కేంద్రం ఏర్పాటుతో పాస్‌పోర్టు ప్రక్రియ మరింత సులభమవుతుందని తెలిపారు. అనంతరం పాస్‌పోర్టు కార్యాలయంలోని ఉద్యోగులతో మాట్లాడి కార్యాలయాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రిత్వ శాఖ జాయింట్‌ సెక్రటరీ కేజీ శ్రీనివాస, ఆర్‌పివో జె.స్నేహజారెడ్డి, హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ హరిచందన దాసరి, డిపిఓ శ్రీనివాసరావు, వివిధ విభాగా అధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *