– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు దిశానిర్దేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 5ఃరానున్న మున్సిపల్, జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బూత్ స్థాయినుంచే పార్టీని మరింత బలోపేతం చేస్తూ పూర్తిస్థాయిలో సంసిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు దిశానిర్దేశం చేశారు. ప్రతి బూత్‌ను బలమైన యూనిట్‌గా తీర్చిదిద్దుతూ, ప్రజలతో మమేకమవ్వాలని సూచించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం జరిగిన బూత్ నిర్మాణ అభియాన్ రాష్ట్రస్థాయి కార్యశాలలో ఆయన ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని, అదే రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి పునాదిగా నిలుస్తుందని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో ఏ బూత్‌లలో తక్కువ ఓట్లు వచ్చాయో కార్యకర్తలు స్పష్టంగా గుర్తించాలని, బలహీనతలను బలంగా మార్చుకోవాలని సూచించారు. ప్రతి 50 మంది ఓటర్లకు ఒక కార్యకర్త ఉండేలా పన్నా ప్రముఖ్ నిర్మాణం జరగాలన్నారు. ఉత్తరప్రదేశ్‌లో తొలిసారిగా, తరవాత గుజరాత్‌లోనూ దీన్ని అనుసరించినట్లు చెప్పారు. బూత్ నిర్మాణ అభియాన్ అనేది పార్టీ భవిష్యత్తు ఎన్నికలకు పునాదివంటిదని, బూత్ అధ్యక్షుడే పార్టీకి మూలస్తంభం అని చెప్పారు. పునాది బలంగా ఉన్నప్పుడే పార్టీ బలంగా ఎదుగుతుందన్నారు. జిల్లాల వారీగా వర్క్‌షాప్‌లు నిర్వహించి మండల స్థాయి వరకు సంస్థాగత నిర్మాణ పనిని విస్తరించాలని సూచించారు. బూత్ నిర్మాణాన్ని ప్రతీ కార్యకర్త తన వ్యక్తిగత బాధ్యతగా తీసుకోవాలని చెప్పారు. ప్రధానమంత్రి మోదీ నాయకత్వ ప్రభావం, ప్రజాభిమానం గాలిలో రాష్ట్రంలో ఎనిమిది పార్లమెంటు సీట్లు గెలుచుకున్నామన్నారు. అదే గాలితో పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేస్తే తెలంగాణలో సుమారు 16 పార్లమెంట్ సీట్లు గెలుచుకునే సామర్థ్యం బీజేపీకి ఉందన్నారు. సమావేశంలో రాష్ట్ర ఇన్‌చార్జ్ అభయ్ పాటిల్, రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వేముల అశోక్ డా. ఎన్.గౌతం రావు, తూళ్ల వీరేందర్ గౌడ్, రాష్ట్ర కార్యదర్శి రవికుమార్, భరత్, రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి, మీడియా ఇన్‌చార్జి ఎన్.వి.సుభాష్ , తదితర సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



