– విపక్షాల నిరసన
– సోమవారానికి వాయిదా పడ్డ ఉభయ సభలు
న్యూదిల్లీ, జూలై 25: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వరుసగా ఐదవరోజు శుక్రవారం ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకుండానే వాయిదా పడ్డాయి. దీంతో సభ సోమవారానికి వాయిదా పడ్డాయి. బీహార్ ప్రత్యేక వోటర్ల జాబితా ఎస్‌ఐఆర్ పై ప్రతిపక్షాలు నిరసన చేపడుతుంటే..చర్చ జరిపేందుకు అనుమతిని ఇవ్వకుండా ప్రభుత్వం మొండిపట్టు పడుతోంది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నలుగురు కన్నా ఎక్కువ సభ్యులు ఉన్న పార్టీల లోక్‌సభ ప్లోర్ లీడర్లతో సమావేశాలు నిర్వహించారు. సమావేశం తర్వాత, ఏకాభిప్రాయం కుదిరిందని అన్నారు. లోక్‌సభ ఆపరేషన్ సిందూర్ గురించి సోమవారం చర్చ జరపనున్నట్లు తెలిపారు. సభ ప్రారంభమైన వెంటనే, ప్రతిపక్ష సభ్యులు బీహార్‌లో ఎస్‌ఐఆర్ సవరణ అంశాన్ని లేవనెత్తడానికి యత్నించారు. వారిలో చాలా మంది నినాదాలు చేపట్టారు. స్పీకర్ ఓంబిర్లా సభ్యులకు ప్రశ్నోత్తరాల సమయాన్ని కొనసాగించేందుకు అనుమతించమని చెప్పారు. ప్రతిపక్షాలు సభలో నినాదాలు చేపట్టడంతో పాటు ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో సభను మధ్యాహ్నం 2.00 గంటల వరకు వాయిదా వేశారు. ముందుగా సభ ప్రారంభమైన వెంటనే తమిళనాడు నుండి కొత్తగా ఎన్నికైన కమల్‌హాసన్, రాజాతి, ఎస్.ఆర్.శివలింగం, పి.విల్సన్‌లు ప్రమాణస్వీకారం చేశారు. బీహార్ ఎస్‌ఐఆర్ సహా వివిధ అంశాలపై చర్చను డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు ఇచ్చిన వాయిదా నోటీసులను డిప్యూటీ చైర్మన్ హరివంశ్ రారు తిరస్కరించారు. ఇతర రాష్ట్రాల్లో బెంగాలీ వలసకార్మికులపై వివక్ష, భారత్ యుకెల మధ్య టిఎస్‌ఎ ఒప్పందం వంటి వివిధ అంశాలపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ రూల్ 267 కింద 28 నోటీసులిచ్చారు. మధ్యాహ్నం 12గంటల వరకు సభ వాయిదా పడింది. వాయిదా అనంతరం కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడటానికి యత్నించారు. కానీ ప్రతిపక్ష ఎంపిల నిరసనల మధ్య రాజ్యసభ సోమవారానికి వాయిదా పడింది.





