– 16 నుంచి తిరిగి సమావేశాలు ప్రారంభం
– మహిళా రిజర్వేషన్, ఎఫ్‌సిఆర్‌ఎ సవరణ బిల్లులపై చర్చ
న్యూదిల్లీ, ఏప్రిల్ 3 : మహిళా రిజర్వేషన్ల సవరణ బిల్లు, ఎఫ్‌సిఆర్‌ఎ సవరణ బిల్లు వంటి ముఖ్యమైన బిల్లులకు ఆమోదం పొందేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలను పొడిగించేందుకు ప్రయత్నిస్తోంది. గురువారం బడ్జెట్ సమావేశాల రెండో దశ ముగిసిన తరువాత పార్లమెంట్ నిరవధికంగా వాయిదా పడుతుందని భావించారు. అయితే, సభా కార్యకలాపాలు ముగిసిన తరువాత ఈ నెల 16న ఉదయం 11 గంటల వరకు సభ వాయిదా పడుతుందని అధికారిక ప్రకటన వెలువడింది. లోక్‌సభ, శాసనసభలలో సీట్లను పెంచేందుకు, మహిళా రిజర్వేషన్లను అమలు చేసేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లులకు ఆమోదం పొందేందుకే సమావేశాలను పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అదే సమయంలో విమర్శలు ఎదుర్కొంటున్న ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ బిల్లుకు కూడా ఆమోదం పొంది తీరాలని కేంద్రం భావిస్తోంది. ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ బిల్లుపై పార్లమెంటు లోపల, వెలుపల భారీ నిరసనలు వెల్లువెత్తిన సంగతి విదితమే. కేరళం శాసనసభ ఎన్నికల ముందు ఈ బిల్లు ఆమోదం పొందితే బీజేపీకి ఎదురుదెబ్బ తగులుతుందని కూడా కేంద్ర ప్రభుత్వం గ్రహించింది. కేరళలో ఎన్నికల తరువాత పార్లమెంటు తిరిగి సమావేశమవుతుంది. ప్రత్యేక సమావేశంలో ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లును కూడా ఆమోదిస్తారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మహిళా రిజర్వేషన్లను అమలు చేయడానికి ఉద్దేశించిన రాజ్యాంగ సవరణలను ఎలా అమలు చేయాలన్న ప్రతిపక్షాల ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం ఇంకా సమాధానం ఇవ్వలేదు. రాజ్యాంగ సవరణను ఆమోదించడానికి కేంద్రానికి ప్రతిపక్షాల మద్దతు కూడా అవసరం. అయితే అఖిలపక్ష సమావేశం నిర్వహించడానికి గానీ, ప్రతిపక్షాల సందేహాలకు వివరణ ఇవ్వడానికి గానీ కేంద్రం సిద్ధంగా లేదు. ఈ పరిస్థితుల్లో తన సొంత ప్రయోజనాలకనుగుణంగా రిజర్వేషన్లను అమలు చేయడానికి ప్రయత్నిస్తోందన్న అనుమానం వ్యక్తమవుతోంది. లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్య పెంపు, మహిళా రిజర్వేషన్ చట్టం సత్వర అమలు వంటి కీలక బిల్లుల కోసం మూడు రోజులపాటు సమావేశాలు కొనసాగే అవకాశాలున్నాయని, ఈ విషయాన్ని విపక్షాలకు ప్రభుత్వం తెలిపిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మహిళా రిజర్వేషన్ కోటా అమలు బిల్లుపై, జనగణనతో నియోజకవర్గాల పునర్విభజనకు ఉన్న లంకెను విడదీయడంపై విపక్షంతో ప్రభుత్వం లోపాయికారీ సంప్రదింపులు జరుపుతోందని తెలుస్తోంది. కేంద్ర సాయుధ పోలీసు దళాల (సీఏపీఎఫ్‌ల)కు ఒకే విధమైన ఉద్యోగ నిబంధనలు ఉండేందుకు ప్రతిపాదించిన బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించింది. రాజ్యసభ ఆమోదించి పంపిన ఈ బిల్లును లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





