– ఎఫ్‌సీఐ ఎండీకి మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి విజ్ఞప్తి
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 6: కేఎంఎస్ 2024-25 రబీ కింద పార్బాయిల్డ్ రైస్ ను అదనంగా కేటాయించాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆష్ తోష్ అగ్నిహోత్రికి విజ్ఞప్తి చేశారు. శనివారం ఆయన సచివాలయంలో అగ్నిహోత్రితో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. కేఎంఎస్ 2024-25 (ఖరీఫ్ & రబీ) కోసం జీఓఐ 30.00 ఎల్ ఎంటీ బాయిల్డ్ రైస్ లక్ష్యాన్ని కేటాయించింది. 2024-25 రబీ నుండి ఇప్పటి వరకు 17.06 ఎల్ ఎంటీ పార్బాయిల్డ్, 0.87 ఎల్ ఎంటీ ముడి బియ్యం సరఫరా చేశారు. ఇంకా పెండింగ్‌లో వున్నబ్యాలెన్స్ 2.34 ఎల్ ఎంటీ పార్బాయిల్డ్, 14.26 ఎల్ఎంటీ ముడి బియ్యం సరఫరాకు రబీ సీజన్ ప్రధానంగా పార్బాయిల్డ్ రైస్‌కు అనుకూలంగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. కాగా, కేఎంఎస్ 2024-25 (రబీ) కింద అదనపు 10 ఎల్ ఎంటీ పార్బాయిల్డ్ రైస్ కేటాయింపు కోసం మంత్రి విజ్ఞప్తి చేశారు. పార్బాయిల్డ్ రైస్ తరలింపు కోసం అదనపు రేక్‌ల అవసరం వుందని పేర్కొన్నారు. ప్రస్తుత సంవత్సరం రేక్ తరలింపు గత సంవత్సరం (జనవరి- నవంబర్) తో పోలిస్తే 13.5 ఎల్ఎంటీల కొరత వుందన్నారు. దీని కారణంగా ఎఫ్‌సీఐ గోడౌన్లలో పార్బాయిల్డ్ బియ్యం నిల్వలు పేరుకుపోవడంతో సీఎంఆర్ డెలివరీలు ఆలస్యం అయ్యాయన్నారు. రాష్ట్రంలోని ఎఫ్‌సీఐ డిపోల నుండి పార్బాయిల్డ్ బియ్యం తరలింపును వేగవంతం చేయడానికి అదనపు రేక్‌లను వెంటనే కేటాయించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. అంతేకాక ఖరీఫ్ 2024-25 కోసం సీఎంఆర్ డెలివరీ వ్యవధి పొడిగించాలని కోరారు. సీఎంఆర్ డెలివరీ సమయం నవంబర్ 12 నాటికి ముగిసింది. పరిమిత ఎఫ్‌సీఐ నిల్వ స్థలం, అధిక సేకరణ పరిమాణాల కారణంగా 2.27 ఎల్ఎంటీ ఇప్పటికీ పెండింగ్‌లో వుందని ఆయన గుర్తుచేశారు. ఖరీఫ్ 2024-25 కోసం సీఎంఆర్ డెలివరీల కోసం 60 రోజుల పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ప్రస్తుత ఎస్‌డబ్ల్యుసీ/ సీడబ్ల్యుసీ నిల్వ సామర్థ్యం 65.00 ఎల్ ఎంటీలుకాగా వివిధ ప్రభుత్వ సంస్థలు పూర్తిగా ఉపయోగించుకుంటున్నాయన్నారు. ఎఫ్‌సీఐ అద్దెకు తీసుకోగల గోడౌన్ల రకంపై పరిమితుల కారణంగా (ఉదా: రైల్వే సైడింగ్ అవసరం లేదా గూడ్స్ షెడ్‌కు సమీపంలో) నిల్వ కొరతను ఎదుర్కొంటున్నది. ఈ పరిమితులు సకాలంలో సీఎంఆర్ డెలివరీలను ప్రభావితం చేస్తున్నాయి. సంబంధిత నిల్వ పథకం కింద ఎఫ్‌సీఐ ద్వారా అదనంగా 15 ఎల్ఎంటీల నిల్వ సామర్థ్యాన్ని మంజూరు చేయాలని కోరారు.
ఫిబ్రవరి 2026 నాటికి రాష్ట్రం 18 లక్షల టన్నులు తీసుకోవాల్సి ఉన్నందున కేఎంఎస్ 24-25 కోసం 10 నుండి 12 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ అదనపు కోటా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మిల్లర్లు ప్రస్తుత ధాన్యం సేకరణ విషయంలో వెనుకాడుతుండటం, మిల్లుల వద్ద స్థలం లేకపోవడం వల్ల కొత్త ధాన్యం సేకరణ ఇబ్బందికరంగా మారే అవకాశముందన్నారు. 7-8 సంవత్సరాల హామీతో ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా రాష్ట్రం మరిన్ని గోడౌన్లను నిర్మాణం చేయడానికి పీఈజీ పథకాన్ని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. (02 సంవత్సరాల రాష్ట్ర హామీ మరియు 06 సంవత్సరాల ఎఫ్‌సీఐహామీ) తదుపరి 4 నెలలకు నెలకు 0.5 లక్షల బాయిల్డ్ రైస్ తరలించాలని విజ్ఞప్తి చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



