కైట్ అండ్ స్వీట్ ఫెస్టివ‌ల్ కు పరేడ్ గ్రౌండ్ సిద్ధం

– సాయంత్రం 4 గంటలకు ప్రారంభించ‌నున్న మంత్రి జూప‌ల్లి
– ప్రత్యేక ఆకర్షణగా నిల‌వ‌నున్న హాట్ ఎయిర్ బెలూన్ అండ్ డ్రోన్ ఫెస్టివ‌ల్
– గ‌చ్చిబౌలి స్టేడియంలో డ్రోన్ షో

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 12ః సికింద్రాబాద్ పరేడ్ మైదానం సంక్రాంతి శోభను సంతరించుకుంది. అంతర్జాతీయ పతంగులు, మిఠాయిల పండగను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ఈ ఉత్స‌వాల‌ను మంగళవారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభించ‌నున్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 13 నుంచి 15 వరకు ఉత్సవాలు నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంత్రి జూప‌ల్లి, ఉన్నతాధికారులు సోమ‌వారం కలిసి సెలబ్రేట్ ది స్కై ఆహ్వానాన్ని అందించారు. ఈ సరదాల సంక్రాంతి ఉత్సవాల్లో ప్రజలకు కావల్సిన వినోదం సహా పసందైన రుచులు అందుబాటులో ఉండనున్నాయి. ఈ ఫెస్టివల్‌లో 19 దేశాల నుంచి 40 మంది అంతర్జాతీయ కైట్ ఫ్లయర్స్, మన దేశంలోని 15 రాష్ట్రాలకు చెందిన 55 నేషనల్ కైట్ ఫ్లయర్స్ పాల్గొన‌నున్నారు. రాత్రి వేళ ఎగిరే పతంగులు వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. దీంతోపాటు కల్చర్ లాంగ్వేజ్ ఇండియన్ కనెక్షన్స్ (సీఎల్ఐసీ) సహకారంతో స్వీట్ ఫెస్టివ‌ల్ ను కూడా నిర్వ‌హిస్తున్నారు. తెలంగాణ. పంజాబ్, గుజ‌రాత్, ప‌శ్చిమ బెంగాల్, కేర‌ళ‌, మ‌హారాష్ట్ర‌తో పాటు ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన మ‌హిళ‌లు త‌మ‌ ఇంట్లోనే త‌యారు చేసిన ప‌లు ర‌కాల స్వీట్ల‌ను పుడ్ కోర్టులోని 60 స్టాళ్ల‌లో ప్ర‌దర్శించి, విక్ర‌యించ‌నున్నారు. చేనేత, హస్తకళల వంద స్టాల్స్ ను కూడా ఏర్పాటు చేశారు. భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సవాలకు మరింత శోభను చేకూర్చనున్నాయి. హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్ మ‌రింత పెంచే విధంగా పకడ్భందీ ఏర్పాట్లు చేయాల‌ని ఇప్పటికే ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అదేశించారు. హైడ్రా పునరుద్ధరించిన చెరువుల వద్ద కూడా ఈసారి ప‌తంగుల‌ను ఎగ‌ర‌వేసేందుకు ఏర్పాట్లు చేశామ‌ని తెలిపారు. ఇలాంటి ఉత్సవాల ద్వారా పర్యాటకులను ఆకర్షించడంతోపాటు పర్యాటకంగా నగరం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.

కార్య‌క్ర‌మాల వివ‌రాలు

1. అంతర్జాతీయ కైట్ & స్వీట్ ఫెస్టివల్ ( 13-15)
వేదిక: సికింద్రాబాద్ ప‌రేడ్ గ్రౌండ్స్
స‌మ‌యం: ఉదయం 10 నుండి రాత్రి 9 గంటల వరకు

2. హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ (16-18)

వేదిక: పరేడ్ గ్రౌండ్స్

స‌మ‌యం: సాయంత్రం 4 నుండి రాత్రి 9 గంటల వరకు

3. డ్రోన్ ఫెస్టివల్ (16-17)

వేదిక: గచ్చిబౌలి స్టేడియం
సమయం: ఉదయం 9:30 నుండి రాత్రి 8 గంటల వరకు


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *