చెన్నై, జూలై31: తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. దివంగత నేత జయలలితకు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఎన్డీయే నుంచి వైదొలగారు. ఈమేరకు మాజీ మంత్రి, సెల్వంకు నమ్మినబంటు రామచంద్రన్ ప్రకటించారు. ఆయన ప్రకటిస్తున్న సమయంలో సెల్వం కూడా అక్కడే ఉన్నారు. మార్నింగ్ వాక్ సమయంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ను పన్నీర్ సెల్వం కలిశారు. పలు విషయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎన్డీయే నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించడం గమనార్హం. ఎన్డీయే కూటమితో పూర్తిగా సంబంధాలు తెంచుకున్నట్లు తెలిపారు. 2026 అసెంబ్లీ ఎన్నికలు సవిూపిస్తున్న తరుణంలో పన్నీర్ సెల్వం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నట్లు పేర్కొన్నారు. పొత్తుల గురించి ఇప్పుడు ప్రస్తావించాల్సిన సమయం కాదని, ఎన్నికల ముంగిట ఆ అంశం గురించి మాట్లాడతామని అన్నారు. మరోవైపు ఇటీవల సినీ నటుడు విజయ్ ప్రారంభించిన తమిళ వెట్రి కళగ (టీవీకే)తో ఓపీఎస్ చేతులు కలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పొత్తుల అంశం గురించి పన్నీర్ సెల్వాన్ని విలేకరులు ప్రస్తావించగా కాలమే చెబుతుంది అంటూ సమాధానం దాటవేశారు. పన్నీర్ సెల్వం ఒకానొక సమయంలో ఏఐఏడీఎంకేలో కీలకంగా వ్యవహరించారు. ఎన్డీయే కూటమిలోనూ ముఖ్యపాత్ర పోషించారు. అయితే పార్టీలో ఏర్పడిన అంతర్గత కలహాలతో బహిష్కరణకు గురైన ఆయన సొంతంగా తన వర్గాన్ని విస్తరించుకున్నారు. తాజాగా ఎన్డీయే నుంచి కూడా బయటకు రావడం తమిళ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
ఎన్డీఎకు పన్నీర్ సెల్వం గుడ్‌బై




