యుద్ధప్రాతిపదికన రహదారుల పునరుద్ధరణ

– 1291 ప్రాంతాల్లో దెబ్బతిన్న రహదారులు, కల్వర్టులు
– మరమ్మతుల కోసం రూ.375 కోట్లు అవసరం
– పంచాయతీరాజ్‌ నష్టంపై మంత్రి సీతక్క సమీక్ష

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 29: భారీ వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీరాజ్‌ విభాగానికి సంబంధించి దెబ్బతిన్న రహదారులు, భవనాలకు సంబంధించిన వివరాలను అధికారులు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్కకు నివేదించారు. ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌(ఈఎన్‌సీ) అశోక్‌, పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ శాఖ అధికారులతో మంత్రి సీతక్క టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. దెబ్బతిన్న రహదారుల తాత్కాలిక మరమ్మతులకు రూ.22.71 కోట్లు, శాశ్వత మరమ్మతులకు రూ.352 కోట్లు అవసరమని ప్రాథమికంగా అంచనా వేశారు. మొత్తం 22 గ్రామాలకు రహదారులు దెబ్బతినగా 14 గ్రామాలకు తాత్కాలికంగా పునరుద్ధరించినట్ల, మిగిలిన గ్రామాలకు పనులు కొనసాగుతున్నట్లు ఈఎన్‌సీ అశోక్‌ తెలిపారు. ప్రజలకు రవాణా ఇబ్బందులు లేకుండా వీలైనంత త్వరగా రహదారుల పునరుద్ధరణ పనులు చేపట్టాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. రాకపోకలు పూర్తిగా దెబ్బతిన్న గ్రామాలకు యుద్ధప్రాతిపదికన రోడ్ల మరమ్మతులు చేపట్టాలని సూచించారు. వర్షాలకు తడిసి కూలే ప్రమాదమున్న భవనాలను తక్షణం ఖాళీ చేయించాలని, పంచాయతీరాజ్‌ ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు వేగంగా చేపట్టాలని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.

వర్షాలకు దెబ్బతిన్న 580 అంగన్‌వాడి భవనాలు

ప్రమాదకరంగా మారిన భవనాల నుంచి అంగన్‌వాడీ కేంద్రాలను సురక్షిత భవనాల్లోకి మార్చాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. బియ్యం, ఇతర సరుకులు తడిసినచోట తిరిగి సరకులు సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు అధికారులు సమగ్ర నివేదిక సిద్ధం చేసి సీఎస్‌ ద్వారా ప్రభుత్వానికి సమర్పించారు. సొంత భవనాల్లో నడుస్తున్న 440 అంగన్‌వాడీ కేంద్రాలు, రెంట్‌ ఫ్రీ భవనాల్లో నడుస్తున్న మరో 140 కేంద్రాలు కలిపి మొత్తం 580 భవనాలు వర్షాల ప్రభావంతో దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. పైకప్పుల లీకేజీలు, గోడలు, బేస్‌మెంట్‌లో పగుళ్లు, గచ్చు దెబ్బతినడం వంటి సమస్యలు ఎక్కువగా కనిపించాయి. భద్రాద్రి కొత్తగూడెం- 75, నిర్మల్‌-100కు పైగా, కామారెడ్డి- 49, గద్వాల్‌- 40, హనుమకొండ- 25, మెదక్‌- 25, వనపర్తి- 22, ఆసిఫాబాద్‌- 20, ములుగు- 20 భవనాలు దెబ్బతిన్నాయి. వీటి మరమ్మతులకు భారీగా నిధులు అవసరమవుతాయని అంచనా వేశారు. సొంత భవనాల మరమ్మతులకు రూ.14 కోట్లు, రెంట్‌ ఫ్రీ భవనాల మరమ్మతులకు రూ.3 కోట్లు ఖర్చవుతుందని లెక్కగట్టారు. భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్‌, కామారెడ్డి, గద్వాల్‌, హనుమకొండ, మెదక్‌, వనపర్తి, ఆసిఫాబాద్‌, ములుగు వంటి జిల్లాల్లో వందల సంఖ్యలో అంగన్‌వాడీ భవనాలు దెబ్బతిన్నాయి. కొన్ని కేంద్రాల్లో వర్షపు నీరు లోపలకు చేరడంతో బియ్యం, పప్పులు, పాల డబ్బాలు, నూనె ప్యాకెట్లు, స్టడీ మెటీరియల్‌ తడిసి ముద్దయ్యాయి. ఆ భవనాల్లో అంగన్‌వాడీ సేవలు తక్షణం నిలిపివేయాలని, సమీపంలోని ప్రభుత్వ భవనాలు లేదా పాఠశాల ప్రాంగణాల్లోకి కేంద్రాలను తాత్కాలికంగా తరలించాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. పిల్లల పోషకాహారం, ఆరోగ్య పరిరక్షణ, విద్య ఒక్కరోజు కూడా అంతరాయం లేకుండా కొనసాగాలని స్పష్టం చేశారు.

ఈఎన్‌సీ కార్యాలయంలో కాల్‌ సెంటర్‌

అధిక వర్షాల పరిస్థితుల్లో ప్రజలకు వేగవంతమైన సహాయం అందించేందుకు పంచాయతీరాజ్‌ శాఖ అన్ని ఏర్పాట్లు చేపట్టింది. రాజధానిలోని ఈఎన్సీ కార్యాలయంలో ప్రత్యేకంగా ఫ్లడ్‌ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు, ఎలాంటి రహదారి సమస్యలు, ఇంజినీరింగ్‌ సమస్యలు తలెత్తినా, ఎక్కడైనా రహదారులు దెబ్బతిన్నా, కల్వర్టులు కూలినా, గండ్లు పడ్డా వెంటనే 040-3517 4352 నెంబర్‌కు సమాచారం అందిస్తే తక్షణం చర్యలు తీసుకోనున్నట్లు పంచాయతీరాజ్‌ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

ములుగు జిల్లాలో సీతక్క పర్యటన

ములుగు, గోవిందరావుపేట, తాడ్వాయి మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి సీతక్క శుక్రవారం ప్రారంభించారు. పనులు పూర్తి అయిన సీసీ రోడ్లు, గ్రామ పంచాయతీ భవనాలు, పశువుల పాకలను ప్రారంభించారు. అలాగే రూ. 2.34 కోట్లతో తలపెట్టిన నూతన పనులకు భూమి పూజ చేశారు.


 

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్‌ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్‌ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్‌ చానల్‌ను సబ్‌ స్క్రైబ్‌ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్‌ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్‌ చేయడం మరిచిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *