పంచాయతీ ఫలితాలు మా పాలనకు గీటురాయి

– రెండేళ్ల పాలన పట్ల ప్రజల్లో సానుకూలత
-కంటోన్మెంట్‌, ‌జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సైతం ఆదరించారు
– వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇవే ఫలితాలు రిపీట్‌ అవుతాయి
– బీఆర్‌ఎస్‌, ‌బిజెపి కూటమికి 3-శాతం కూడా సీట్లు దక్కలేదు
– ఇప్పటికైనా బీఆర్‌ఎస్‌ ‌బుద్దిగా మసలుకోవాలి
– మీడియా సమావేశంలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి
హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబర్‌18: మూడు దశల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అద్భుతమైన ఫలితాలను సాధించిందని.. 2029 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు పునరావృత మవుతాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. మా రెండేళ్ల పాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పు ఈ ఫలితాలని ఆయన అభివర్ణించారు. కంటోన్మెంట్‌, ‌జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సైతం కాంగ్రెస్‌ ‌పార్టీని ప్రజలు ఆశీర్వదించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. పార్టీ విజయం కోసం కష్టపడిన కాంగ్రెస్‌ ‌కార్యకర్తలందరి కీ ధన్యవాదాలు తెలిపారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి, దామోదర్‌ ‌రాజనర్సింహలతో కలిసి సీఎం మాట్లాడారు. మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌పార్టీ అద్భుత ఫలితాలు సాధించిందని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి తెలిపారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌పార్టీని ఆశీర్వదించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ గెలుపునకు కష్టపడిన కాంగ్రెస్‌ ‌పార్టీ కార్యకర్తలకు శుభాకాంక్షలు చెప్పారు. ఈ పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన అధికారులకు సీఎం రేవంత్‌ ‌రెడ్డి అభినందనలు తెలియజేశారు. 12,702 పంచాయతీలకు గాను 7,527 పంచాయతీల్లో కాంగ్రెస్‌ ‌పార్టీ గెలిచిందన్నారు. 808 కాంగ్రెస్‌ ‌రెబల్స్ ‌నెగ్గారని వివరించారు. 66 శాతం ఫలితాలను కాంగ్రెస్‌ ‌సాధించిందని తెలిపారు. 3,511 బీఆర్ ఎస్‌ , 710 ‌బీజేపీ మొత్తంగా 33 శాతం గెలిచాయని పేర్కొన్నారు. 94 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికలు జరిగాయని.. 87 నియోజక వర్గాల పరిధిలో కాంగ్రెస్‌ ‌మెజారిటీ సాధించిందని స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయన్నారు. తమ ప్రభుత్వంపై ప్రజలు సంపూర్ణ విశ్వాసం కనబరిచారని ధీమా వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌, ‌బీజేపీ కూటమిగా పోటీ చేశాయని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌, ‌బీజేపీ కూటమికి 33శాతం విజయాలు మాత్రమే దక్కాయన్నారు. బీఆర్‌ఎస్‌కు 3,511 సర్పంచ్‌ ‌స్థానాలు, బీజేపీ 710 చోట్ల గెలిచాయని చెప్పారు. బీఆర్‌ఎస్‌, ‌బీజేపీ కూటమికి 4,221 స్థానాలు మాత్రమే దక్కాయని సీఎం రేవంత్‌ ‌తెలిపారు. ఇటీవల ప్రజాపాలన రెండేళ్ల సంబురాలు నిర్వహించుకున్నామని సీఎం రేవంత్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని 12వేలకు పైగా గ్రామపంచాయతీల్లో ఎన్నికలు ప్రశాంతంగా, ప్రజాస్వామ్య బద్దంగా జరిగాయి. ఎన్నికలు సజావుగా నిర్వహించిన అధికారులకు అభినందనలు తెలిపారు. దాదాపు 146 గ్రామ పంచాయతీలు (ఒక శాతం) సీపీఐ, సీపీఎం, ఇతరులు గెల్చుకున్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లయిన తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ ప్రజలు కాంగ్రెస్‌ను ఆదరించారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలు మా రెండేళ్ల పాలనపై తీర్పుగా భావిస్తున్నామ‌న్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే పెద్దల సూచనను పాటిస్తాం. కానీ, ప్రతిపక్షంలో ఉన్న వారికి ఇంకా అహంకారం తగ్గలేదు. ఇప్పటికైనా ప్రజా తీర్పును గౌరవించి.. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు సహకరించాలని రేవంత్‌
‌రెడ్డి అన్నారు. పేదలకు మేం అందిస్తున్న సంక్షేమ పథకాలే మా విజయానికి కారణం. ఈ ఫలితాలను చూసి భారత రాష్ట్ర సమతి నేతలు అద్భుతం అంటున్నారు. సంతోషం.. మీరు కోరుకున్నట్టే ఈ అద్భుతం 2029లో కూడా జరుగుతుంది. 2/3 మెజార్టీతో 2029లో కాంగ్రెస్‌ ‌తిరిగి అధికారంలోకి వస్తుంది. 1/3తో భారత రాష్ట్ర సమితి ఉంటే.. 2/3 మెజార్టీతో కాంగ్రెస్‌ ఉం‌టుందని సీఎం అన్నారు.
—————————————————————————————————————————————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *