“మొత్తంగా చూస్తే రిజర్వేషన్ల ఖరారు విధానం పటిష్ఠంగా అమలు కాకపోవడం వల్ల బీసీ వర్గాలకు తీరని నష్టం జరిగింది. వారికి లబ్ధి చేకూరాల్సిన చోట న్యాయపరమైన స్పష్టత లేకపోవడం, రాజకీయ హామీలు అమలులో వెనుకంజ వేయడం, సర్వేలు పూర్తి శాస్త్రీయత లేకపోవడం, ఎన్నికల షెడ్యూలు విడుదల సమయంలో న్యాయపరమైన అయోమయం నెలకొనడం— ఈ ఎన్నికలను అత్యంత క్లిష్టమైన దశకు తీసుకు వచ్చాయి. హైకోర్టు తుది తీర్పు ఏ రూపంలో వచ్చినా భవిష్యత్తులో రిజర్వేషన్ నిర్మాణంపై, గ్రామీణ స్వయం పాలనలో బీసీ వర్గాల ప్రాతినిధ్యంపై, ప్రభుత్వాల నిర్ణయాధికారం పై పూర్తిస్థాయి ప్రభావం చూపడం ఖాయం. ప్రజలు, రాజకీయ పార్టీలు, న్యాయ వర్గాలు హైకోర్టు తీర్పు కోసం అత్యంత ఉత్కంఠతో ఎదురు చూడక తప్పని స్థితిలో…ప్రస్తుత ఎన్నికల నిర్వహణ తొందరపాటు చర్యగా భావిస్తున్నాయి.”
తెలంగాణ పంచాయితీ ఎన్నికలు 2025 రాష్ట్ర రాజకీయాలను ఒకే దెబ్బకు కుదిపేశాయి. ఎన్నికల ప్రక్రియ సాధారణ పద్ధతిలో సాగాల్సిన చోట రిజర్వేషన్ల అమలు విధానం, కోర్టుల తీర్పులు, ప్రభుత్వ జీఓ లు, బీసీ వర్గాల అసంతృప్తి, ఎన్నికల షెడ్యూలు అనుకోని వేళ విడుదల అన్నీ కలిసి ఒక సంక్లిష్ట స్థితి సృష్టించాయి. బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం ప్రకటించిన శాతం, వాటి అమలులో ఉన్న లోపాలు, హైకోర్టు–సుప్రీంకోర్టు సంఘటనలు, డెడికేషన్ కమిటీ నివేదిక— ఈ ఎన్నికలను కేవలం స్థానిక సంస్థల ఎన్నికలుగా కాకుండా సామాజి రాజకీయ–న్యాయపరమైన ఉద్విగ్న పరీక్షగా మార్చాయి. 2025 లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత స్థానిక సంస్థల్లో బీసీలకు పెరిగిన ప్రాతినిధ్యం ఇవ్వాలన్న హామీతో 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని నిర్ణయించింది.
ఇందుకు GO Ms.No.9 తేదీ 26-09-2025 ప్రాతిపదికగా మారింది. ఈ జీఓ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసల కన్నా ప్రశ్నలని ఎక్కువగా తెచ్చి పెట్టింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన 50 శాతం గరిష్ఠ రిజర్వేషన్ పరిమితిని దాటడానికి ప్రభుత్వం చూపిన ఆధారాలు స్పష్టంగా కనిపించ లేదు. ముఖ్యంగా సుప్రీంకోర్టు 2010లో ఇచ్చిన తీర్పు ప్రకారం “ట్రిపుల్ టెస్ట్” తప్పనిసరి. అంటే ఓబీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ వెనుకబాటుతనం పై ప్రత్యేక అధ్యయనం, ఆ అధ్యయనాన్ని అధికారికంగా ప్రకటించడం, దాని ఆధారంగా ప్రతీ నియోజకవర్గంలో రిజర్వేషన్లను క్రమపద్ధతిలో అమలు చేయడం వీటిని ప్రభుత్వం పూర్తిగా పాటించలేదనే సందేహాలు మొదటి దశ నుంచే హైకోర్టులో వినిపించాయి.
ఈ నేపథ్యంలో హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. పిటిషనర్ల అభిప్రాయం ప్రకారం బీసీ ల జనాభా శాతం గురించి ప్రభుత్వం పేర్కొన్న గణాంకాలు శాస్త్రీయ పద్ధతిలో సేకరించ బడలేదు. ప్రభుత్వం ఆధారపడిన సామాజిక–ఆర్థిక–విద్యా సర్వేను సరిగ్గా నిర్వహించలేదని, సేకరించిన డేటా బలహీనమని, ఆ డేటాను ప్రజలకు వివరంగా వెల్లడించక పోవడం అనుమానాలను మరింత పెంచిందని వాదించారు. దీంతో హైకోర్టు 2025 అక్టోబర్ 9న GO Ms.No.9 అమలును స్టే చేస్తూ పంచాయతీ ఎన్నికలు పాత రిజర్వేషన్ విధానం ప్రకారం నిర్వహించాలని ఆదేశించింది. ఈ నిర్ణయం బీసీ వర్గాల్లో తీవ్రమైన ప్రతిస్పందన కలిగించింది. ప్రభుత్వం ఈ స్టేను నిలిపి వేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించినా సుప్రీంకోర్టు “హైకోర్టు విచారణ కొనసాగుతోంది; మేము జోక్యం చేసుకోలేం” అని పేర్కొనడంతో ప్రభుత్వం వెనుదిరగాల్సి వచ్చింది. ఇది 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ప్రభుత్వ హామీ పై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసింది.
రిజర్వేషన్ల అమలులో లోపాలు బయటపడ్డ కొద్దీ ప్రభుత్వం త్వరగా మరో GO Ms.No.46 తేదీ 28-10-2025 జారీ చేసి బీసీ రిజర్వేషన్‌ను తిరిగి 23 శాతానికి పరిమితం చేయాల్సి వచ్చింది. ఇదే సమయంలో డెడికేషన్ కమిటీ నివేదిక మరింత గందరగోళాన్ని సృష్టించింది. బీసీ జనాభా 50 శాతం దాటిందని కమిటీ పేర్కొన్నప్పటికీ ఆ నివేదికను ప్రజలకు పూర్తిగా వెల్లడించక పోవడం, డేటా సేకరణ స్వతంత్రతపై ప్రశ్నలు లేవనెత్తబడడం, రిజర్వేషన్ ఖరారు చేసే జిల్లా-వారీ పద్ధతిలో అనేక అసమానతలు కనిపించడం వంటివి కోర్టుల దృష్టినీ, ప్రజల అనుమానాలనూ ఆకర్షించాయి. పంచాయతీ వారీగా రిజర్వేషన్లను ఖరారు చేసే సమయంలో గత ఎన్నికలలో చోటుచేసుకున్న లోపాలను పునరావృతం చేసినట్లు అనేక ప్రాంతాల ప్రజలు విమర్శించారు.
ఒక గ్రామంలో బిసి వోటర్లు అధికంగా ఉన్నా, సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల్లో ఒక్కటి కూడా బీసీలకు కేటాయించ బడక పోవడం, ఓసీల జనాభా లేని గ్రామాలలో ఆ కేటగిరీకి రిజర్వ్ కావడం, పేదరిక రేఖ కింద ఉన్న బీసీ వర్గాలకు ప్రాతినిధ్యం తగ్గడం వంటి సమస్యలు విస్తృతంగా వెల్లడి అయ్యాయి. గతంలో ఎస్సీ లకు కేటాయించ బడిన స్థానాలు రొటేషన్ కారణంగా జనరల్ స్థానాలు కాగా ఆ స్థానాల్లో అధిక సంఖ్యలో ఎస్సీలు ఉన్న కారణంగా వారే గెలిచే అవకాశాలు అనివార్యం కాగా, అలాగే జనరల్ స్థానాలలో కూడా అందరూ పోటీ చేసే అవకాశాలు కల్పించ బడిన క్రమంలో ప్రధానంగా బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతున్న మాట వాస్తవం
ఇలాంటి పరిస్థితుల్లో హైకోర్టు తుది తీర్పు రావాల్సిన రోజులు దగ్గర పడుతుండగానే ఎన్నికల సంఘం అక్టోబర్ చివరి వారంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌తో మొత్తం 12,769 గ్రామ పంచాయితీలు, సుమారు 6 లక్షల ప్రజాప్రతినిధుల స్థానాలకు ఎన్నికలు జరగాల్సిన స్థితి ఏర్పడింది. హైకోర్టు తుది తీర్పు వెలువడక ముందే నోటిఫికేషన్ ఇవ్వడంతో బీసీ వర్గాల్లో అసంతృప్తి మరింత పెరిగింది. ఒకవైపు ప్రభుత్వం ప్రకటించిన 42 శాతం రిజర్వేషన్ అమలవుతుందన్న ఆశతో ఉన్న బీసీ వర్గాలు, మరోవైపు కోర్టుల తీర్పులు, ప్రభుత్వ వెనుకడుగు—కలగలిపి బీసీలు తమకు తగిన న్యాయం జరగలేదని భావించేవారయ్యారు. రిజర్వేషన్ల ఖరారు పద్ధతిలో ఉన్న లోపాలు కూడా గట్టిగా వెలుగులోకి వచ్చాయి. డెడికేషన్ కమిటీ నివేదికను కోర్టులో సమర్పించినప్పుడు అందులోని అనేక గణాంకాలు పునర్విమర్శ చేయాల్సిన స్థితి కనిపించిందని న్యాయమూర్తులు వ్యాఖ్యానించినట్లు న్యాయవర్గాల్లో చర్చ.
పూర్వాపరాలు పరిశీలిస్తే ఈ వివాదానికి మూలం 1994 లోని పంచాయితీ రాజ్ చట్టం సవరణల్లో ఉంది. కాలక్రమేణా రిజర్వేషన్ల శాతం పెరుగుతూ 50 శాతం పైకి వెళ్ళినప్పుడు 2010లో సుప్రీంకోర్టు దీనిపై స్పష్టమైన పరిమితి విధించింది. అదే 50 శాతం హద్దు. దీనిని దాటేందుకు ప్రత్యేక సామాజిక అధ్యయనం తప్పనిసరి. కానీ తెలంగాణ ప్రభుత్వం చేసిన సర్వే పూర్తి శాస్త్రీయ ప్రమాణాలు పాటించ లేదనే అభిప్రాయం రూపు దిద్దుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో బీసీ వర్గాల సంఖ్య 55-60 శాతం ఉందని రాజకీయ నాయకులు చెప్పినప్పటికీ అధికారిక సర్వే లో ఆ సంఖ్యను ధృవీకరించే పద్ధతులు స్పష్టంగా చూపబడలేదు. ఈ లోపంపై హైకోర్టు కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది.