– పాల్గొన్న మంత్రులు పొన్నం, తుమ్మల
– ఆయిల్ పామ్ సాగుకు మారాలని రైతులకు పిలుపు
కోహెడ (హుస్నాబాద్), ప్రజాతంత్ర, జూలై 17: హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలం బస్వాపూర్ గ్రామంలో మెగా ఆయిల్ పాం ప్లాంటేషన్ కార్యక్రమాన్నిగురువారం ప్రారంభించి మొక్కలను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ లు నాటారు. సిద్దిపేట జిల్లాలో మెగా ఆయిల్ పాం ప్లాంటేషన్ లో బాగంగా 143 ప్రాంతాల్లో 23 గ్రామాల్లో 674 ఎకరాల్లో ప్లాంటేషన్ చేపట్టారు. కోహెడ మండలం బస్వాపూర్ గ్రామంలో ఏనుగు రామారావు వ్యవసాయ పొలంలో 50 ఎకరాల్లో ఆయిల్ పాం సాగును గురువారం ప్రారంభించారు. మండలంలో 2025- 26 లో 359 ఎకరాల సాగును అధికార్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. సిద్దిపేట జిల్లాలో 3747 మంది రైతులు 12,242 ఎకరాల్లో ఆయిల్ పామ్‌ను సాగు చేస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ ఈ భూమిలో రామారావు ఇప్పటికే 30 ఎకరాల ఆయిల్ పాం సాగు చేస్తున్నారు.. ఇప్పుడు మరో 50 ఎకరాల్లో సాగు చేయనున్నారన్నారు. పంట ను నర్మేట లో ఉత్పత్తి ప్రారంభం అయిన తరువాత ఇక్కడే తీసుకుంటారు. ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం కాగానే మీ పంట నుండి ఫ్యాక్టరీ వరకు రవాణా ఖర్చు వారే భరిస్తారన్నారు. రైతుకు 10 ఎకరాలు ఉంటే 5 ఎకరాలు ఆయిల్ పాం సాగు చేయమని పిలుపునిచ్చారు. మన దేశంలో ఆయిల్ పాం సాగు తక్కువగా ఉండడం వల్ల లక్షల కోట్ల విలువైనవి దిగుమతి చేసుకుంటున్నామన్నారు. హార్టికల్చర్ అధికారుల సహకారంతో ఆయిల్ పాం సాగు మంచి దిగుబడి వచ్చేలా చూసుకోవాలన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఆయిల్ పాం పై మంచి అనుభవం ఉంది. 30 సంవత్సరాలుగా ఆయిల్ పాం సాగు చేస్తున్నారు. మా ప్రాంతంలో కూడా ఆయిల్ పాం సాగు చేయాలని 5 ఎకరాల పైన ఉన్న రైతులతో సమావేశాన్ని ఏర్పాటు చేశా. హుస్నాబాద్ లో ఒక్క గుంట భూమి కూడా వృధా గా ఉండవద్దు. గౌరవెల్లి ప్రాజెక్ట్ ద్వారా ఈ ప్రాంత రైతులకు నీరు ఇచ్చే బాధ్యత నాదన్నారు. ఆయిల్ పాం, డ్రాగన్ పంటలు వేసి అధిక ఆదాయాన్ని పొందమని పిలుపునిచ్చారు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ పొన్నం ప్రభాకర్ మీ శాసన సభ్యులు కావడం మీ అదృష్టమన్నారు. నిరంతరం హుస్నాబాద్ కోసమే పరితపిస్తుంటారు. ఎన్నికల్లో ,రాజకీయాల్లో అభివృద్ధి కోసం అందరినీ కలుకుపోతుంటారు. రైతులు ఆయిల్ పాం సాగు వైపు మొగ్గు చూపాలి. ఈరోజు మెగా ఆయిల్ పాం మొక్కలు నాటుతున్నారు.. ఇందులో రేపే ఆదాయం వచ్చే అంతర పంటలు వేయాలి. ఆయిల్ పాం సాగు పై మా దగ్గరకు రైతులు రండి.. అవగాహన పెంచుకోండి. ఖమ్మం తరువాత అత్యధిక ఆయిల్ పాం సాగు సిద్దిపేట జిల్లాలోనే జరుగుతుందన్నారు. ప్రజా పాలన ప్రభుత్వంలో 12 లక్షల ఎకరాల ఆయిల్ పాం సాగు లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆగస్టు 15 తేదీలోపు ముఖ్యమంత్రి చేత నర్మేట లో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభిస్తాం . ఆయిల్ పాంసాగు చేస్తున్న వారికి మీ తోట కి ఫ్యాక్టరీ కి ఎంత దూరం ఉందో కిలోమీటర్ ప్రాతిపదికన కిరాయి కూడా ప్రభుత్వమే ఇస్తుందన్నారు. ఒక ఎకరం వరి పొలానికి ఇచ్చే నీరు.. 5 ఎకరాల ఆయిల్ పాం సాగు చేయవచ్చు. విద్యుత్ ,నీరు ఆదా అవుతుంది. బయట దేశాల నుండి వచ్చే ఆయిల్ మీద సుంకం తగ్గించారు.. దాని వల్ల రూ.2 వేలు మనకి ఆదాయం తగ్గింది. దక్షిణ భారత మంత్రులను తీసుకొని ప్రధాని దగ్గరకు వెళ్తున్నానన్నారు. రూ.25 వేలు క్వింటాలుకు ఇవ్వండి.. దేశానికి సరిపడ పాం ఆయిల్ ఇస్తాం అని చెబుతున్నానన్నారు. రిఫైన్డ్ ఫ్యాక్టరీ కూడా ఇక్కడే పెడతాం. తెలంగాణ మొత్తానికి హుస్నాబాద్ ఆయిల్ పాం గుండెకాయ . రాష్ట్రంలో ఎక్కడి నుండి అయినా ఇక్కడికి ఆయిల్ పాం తీసుకురావచ్చు. దానివల్ల ఉద్యోగాలు కూడా పెరుగుతాయి. ఆయిల్ పాం కటింగ్ పై శిక్షణ ఇవ్వాలి. కొత్తవారికి కలెక్టర్ జీతం కన్నా ఎక్కువగా ఉంటుందన్నారు. కలెక్టర్ హైమవతి మాట్లాడుతూ నేను రైతు బిడ్డనే 18 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు వ్యవసాయ పని చేసిన. రైతులకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. ఈ ప్రాంతంలో గ్రౌండ్ వాటర్ తక్కువ ఉంది. వరి ఎక్కువ నీరును తీసుకుంటుంది. అయిల్ ఫామ్ వేసుకోవడానికి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. రైతులు ఆయిల్ ఫామ్ వేసుకోండి . ఫ్యాక్టరీ కూడా మనకు దగ్గరలో ఏర్పాటవుతున్నందున రైతులు ఆయిల్ ఫామ్ కు మారాలని కోరారు. ఆయిల్ పామ్ రైతు రామారావు మాట్లాడుతూ 50 ఎకరాల్లో ఆయిల్ ఫాం సాగు చేస్తున్న. దీనికి కోతుల బెడద ఉండదు ,అకాల వర్షం వల్ల నష్టాలు ఉండవు. డ్రిప్ ద్వారా దీనిని మెయింటైన్ చేయవచ్చు. పంట దిగుబడి రావడానికి 4 సంవత్సరాలు పడుతుంది. బీడు భూములు ఆయిల్ ఫాం సాగు చేయవచ్చు. ఆయిల్ పాం సాగు ద్వారా మంచి లాభాలు ఉన్నాయి. ఒక్కసారి పంట దిగుబడి ప్రారంభం అయితే 30 సంవత్సరాల వరకు ఆదాయం వస్తుందన్నారు. కార్యక్రమంలో ఆయిల్ పాం కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి , హార్టికల్చర్ డైరెక్టర్ యాస్మిన్ బాషా, జిల్లా కలెక్టర్ హైమవతి , అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్, మార్కెట్ కమిటీ చైర్మన్లు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.



