రేపు నీటిని విడుదల చేయనున్న మంత్రి పొంగులేటి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 13: ఖమ్మం జిల్లాలో సుమారు నాలుగు లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే పాలేరులోని నాగార్జునసాగర్ ఎడమ ప్రధాన కాల్వ అండర్ టన్నెల్(యూటీ) నిర్మాణ పనులను యుద్దప్రాతిపదికన పూర్తిచేసి సోమవారం నుంచి 1500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉదయం 10గంటలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. కూసుమంచి మండలం జుజ్జులరావుపేటలో జరుగుతున్న సాగర్ కాల్వ పనులను జిల్లా కలెక్టరు అనుదీప్ దురిశెట్టితో కలిసి ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు సెప్టెంబర్‌లో కూసుమంచి మండలం జుజ్జులరావుపేట సమీపంలో పాలేరు రిజర్వాయర్ దగ్గర ప్రధాన కాల్వపై అండర్ టన్నెల్ ( యూటీ) కొట్టుకపోయిందన్నారు. రైతులకు ఇబ్బంది కలగకూడదన్న ఆలోచనతో అప్పట్లో తాత్కాలిక ఏర్పాట్లు చేసి సాగునీటిని అందించామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు, రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో యూటీ పనులు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. శాశ్వత ప్రాతిపదికన రూ.14.20 కోట్లతో ఈ యూటీ మరమ్మతులను ప్రారంభించామని, ఖమ్మం జిల్లాలో వ్యవసాయ రంగానికి జీవనాధారమైన ఈ కాల్వ మరమ్మతులు పూర్తిచేసి సాగునీరందిస్తామన్నారు. దీనివల్ల ఖమ్మం జిల్లాలో సుమారు నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరందుతుండగా ఒక్క పాలేరు నియోజకవర్గంలో 1.33 లక్షల ఎకరాలకు సాగునీరందుతున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని అత్యంత ప్రాధాన్యతా క్రమంలో రోజు కు రెండు షిఫ్ట్‌లలో పనిచేసి గడువులోగా నిర్మాణ పనులను పూర్తి చేశామన్నారు.





