– అధికారంలోకి రాగానే ప్రాజెక్టుల పనులు మొదలుపెట్టాలనుకున్నాం
– కేసులు వేసి పనులకు అడ్డుపడిన బీఆర్‌ఎస్ నాయకులు
– మక్తల్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
మక్తల్, ప్రజాతంత్ర, డిసెంబర్ 1: ప్రజా ప్రభుత్వం రాగానే ప్రాజెక్టుల పనులు మొదలుపెట్టాలని ప్రయత్నిస్తే కోర్టులో కేసులు వేసి ఏడాదిన్నర పనులు జరగకుండా ఆపారు.. ఏ రైతుకూ నష్టం జరగవద్దని ఎకరానికి రూ.20 లక్షలు ఇచ్చి 96 శాతం రైతులను ఒప్పించి భూసేకరణ చేశాం.. నారాయణపేట-కొడంగల్ ప్రాజెక్టు భూసేకరణ పూర్తి చేసి ఇప్పుడు పనులు మొదలు పెట్టుకోబోతున్నాం అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని ఆత్మకూరు(ఎం), అమరచింత మున్సిపాలిటీల పరిధిలో రూ.151.92 కోట్ల అభివృద్ధి పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మక్తల్‌లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ మీ పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నాడు అంటూ పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేసి సాగునీరందించే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు. పాలమూరు జిల్లా నుంచి 12మంది ఎమ్మెల్యేలను అందించి నిండు మనసుతో ఆశీర్వదించారు.. మీ ఆశీర్వాదంతో రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా ఇవాళ మీ ముందు నిలబడ్డా అని అన్నారు. ఆనాడు పాలమూరులో ఊరు లేకపోయినా కెేసీఆర్‌ను ఈ గడ్డ ఆదరించింది.. కానీ పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి సంగం బండను పగలగొట్టేందుకు రూ.12 కోట్లు కూడా ఇవ్వలేదు అని విమర్శించారు. ప్రతీ పేదవాడికి విద్య అందించాలనే ఉద్దేశంతో విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చావం.. ప్రతీ నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నాం.. పార్టీల గురించి ఆలోచన చేయలేదు.. జెండాలు, అజెండాలు చూడలేదు.. పాలమూరు అభివృద్ధి లక్ష్యంగా జిల్లాలో 14 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నాం జిల్లాలో ఐఐటీ ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పారు. దేశానికి పాలమూరు జిల్లా ఆదర్శంగా ఉండాలనేదే తమ ఆకాంక్ష.. మీరు చేతికి ఓటు వేసి గెలిపిస్తే అభయహస్తమై మీ జీవితాల్లో వెలుగులు నింపుతోంది.. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం.. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం.. రేషన్ కార్డుల ద్వారా పేదలకు సన్న బియ్యం అందిస్తున్నాం.. రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేశాం.. రెండేళ్లల్లో రైతులకు రూ.లక్షా 4 వేల కోట్లు ఖర్చు చేశాం.. మహిళల ఆర్ధికాభివృద్ధికి కృషి చేస్తున్నాం.. కులగణన చేసి బలహీనవర్గాల లెక్క తేల్చాం.. ఎస్సీ వర్గీకరణ చేసి చూపించాం అని వివరించారు. ఒకవైపు కేసీఆర్ చేసిన రూ.8 లక్షల కోట్ల అప్పును చెల్లిస్తూ పాలమూరు అభివృద్ధికి మీ బిడ్డగా కృషి చేస్తున్నానని సీఎం రేవంత్ చెప్పారు. రాష్ట్రాన్ని గాడిన పెట్టి అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఈ నెల 8, 9న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నాం.. తెలంగాణ గొప్పదనాన్ని ప్రపంచానికి చాటుతున్నాం.. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఏకానమీగా తీర్చిదిద్దుతాం అని చెప్పారు. పంచాయతీ ఎన్నికలు వచ్చాయి.. కాళ్లల్లో కట్టెలు పెట్టే వాళ్ళను కాదు.. అభివృద్ధిని కోరుకునేవారిని ఎన్నుకోండి.. మంచి వాళ్లను సర్పంచులుగా ఎన్నుకోండి.. మీ గ్రామాలను అభివృద్ధి చేసుకోండి అని ఆయన పిలుపునిచ్చారు. మీకు నిధులు, నీళ్లు ఇచ్చే బాధ్యత నాది.. పదేళ్లలో పాలమూరును పసిడి పంటల పాలమూరుగా అభివృద్ధి చేసుకుందాం అని ముఖ్యమంత్రి రేవంత్ హామీ ఇచ్చారు. కాగా, ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో రూ.15 కోట్లతో మౌలిక వసతులు, వివిధ అభివృద్ధి పనులకు, రూ.121.92 కోట్లతో ప్రియదర్శి జూరాల ప్రాజెక్టు డ్యాం దిగువన హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. అలాగే ఆత్మకూరు మున్సిపాలిటీలో 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మాణానికి. రూ.15 కోట్లతో అమరచింత మున్సిపాలిటీ పరిధిలో మౌలిక వసతులు, వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో రూ.8 కోట్లతో మౌలిక వసతులు, వివిధ అభివృద్ధి పనులకు, రూ.25 కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి, రూ.3.50 కోట్లతో మక్తల్ కేజీబీవీలో మౌలిక సదుపాయాల కల్పన, నూతన తరగతి గదుల నిర్మాణానికి, రూ.82.32 కోట్లతో మక్తల్-నారాయణపేట్ రోడ్డు మొదటి దశలో 26 కి.మీ అభివృద్ధి పనులకు కూడా సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. మక్తల్‌లో శ్రీ పడమటి ఆంజనేయస్వామిని ముఖ్యమంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





