-400 మంది మృతి
-250 మందికి గాయాలు
– ఆయుధ డిపోపై దాడి చేశాం: పాక్
– ఇది అబద్ధమన్న తాలిబన్ ప్రభుత్వం
ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, హైదరాబాద్, మార్చి 17: కాబూల్‌లోని ఒక డ్రగ్ రిహాబిలిటేషన్ సెంటర్ (మత్తుపదార్థాల విముక్తి పునరావాస కేంద్రం)పై పాకిస్తాన్ సోమవారం రాత్రి జరిపిన వైమానిక దాడిలో కనీసం 400 మంది మరణించగా, మరో 250 మంది గాయపడ్డారు. ఇరు పొరుగు దేశాల మధ్య మూడు నెలలుగా కొనసాగుతున్న ఘర్షణల్లో ఇదే అత్యంత ఘోరమైన దాడి అని ఆఫ్ఘన్ అధికారులు తెలిపారు. అఫ్ఘానిస్తాన్ రాజధానిలో ధ్వంసమైన శిథిలాల నుండి సహాయక సిబ్బంది మృతదేహాలను వెలికితీస్తుండగా, పాకిస్తాన్ సైనిక,ప్రభుత్వ అధికారులు ఆఫ్ఘన్ అధికారుల ప్రక్రియలను “తప్పుడు ఆరోపణలు”గా కొట్టిపారేశారు. ఈ దాడికి తామే బాధ్యులమని అంగీకరించినప్పటికీ తాము లక్ష్యం చేసుకున్నది ఒక ఆయుధ డిపోను మాత్రమేనని వారు తెలిపారు. మంగళవారం తాలిబన్ ప్రతినిధి మాట్లాడుతూ ఆఫ్ఘనిస్తాన్ తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటుందని హెచ్చరించారు. ఫిబ్రవరి చివరలో ఉద్రిక్తతలు పెరగకముందు వరకు ఇరు దేశాల ప్రభుత్వ అధికారులు క్రమం తప్పకుండా సమావేశమయ్యేవారు. ఇప్పుడు ఈ హెచ్చరికలతో ఇరు దేశాల మధ్య పూర్తిస్థాయి యుద్ధం జరిగే ప్రమాదం ఏర్ప డింది. పాకిస్తాన్‌లో వందలాది దాడులకు కారణమైన ఇస్లామిక్ ఉగ్రవాద గ్రూపులకు తాలిబన్ ప్రభుత్వం ఆశ్రయం ఇస్తోందని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. అయితే పాకిస్తాన్ దాడులు ఆఫ్ఘన్ సైనిక మౌలిక సదుపాయాలతో పాటు పౌర గృహాలు, శరణార్థి శిబిరాలు మరియు 20 కి పైగా ఆరోగ్య కేంద్రాలను దెబ్బతీశాయని ఐక్యరాజ్యసమితి వెల్లడిస్తోంది. ఇదిలావుండగా సోమవారం దాడికి గురైన భవనం తాలిబన్ ప్రభుత్వం నడుపుతున్న డ్రగ్ రిహాబిలిటేషన్ సెంటర్ అని స్థానికులు ధ్రువీకరించారు. దాడి సమయంలో అక్కడ 200 మంది రోగులు ఉన్నారని ఆరోగ్య శాఖ ప్రతినిధి వెల్లడించిన సమాచారాన్నిబట్టి తెలుస్తోంది. ఘటనా స్థలంలో ఉన్న ఒక బోర్డుపై దారీ భాషలో “సపోర్ట్ అండ్ ట్రీట్‌మెంట్ సెంటర్, ఒమిద్” (ఒమిద్ అంటే ‘ఆశ’ అని అర్థం) అని రాసి ఉంది. మంగళవారం తమ బంధువుల ఆచూకీ కోసం వందలాదిమంది ప్రజలు ఆ కేంద్రం వద్ద గుమికూడటం కనిపించింది. నార్వేజియన్ రెఫ్యూజీ కౌన్సిల్ (ఎన్ఆర్‌సీ) ప్రతినిధి జాకోపో కారిడి ఘటనా స్థలాన్ని సందర్శించిన తర్వాత మాట్లాడుతూ అక్కడ ఎటువంటి సైనిక మౌలిక సదుపాయాలు కనిపించలేదని, సామాన్యుల మరణాల సంఖ్య వందల్లో ఉందని పేర్కొన్నారు. పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి అట్టావుల్లా తారర్ మాత్రం అఫ్ఘన్ తాలిబన్ పాలన ఉపయోగిస్తున్న మౌలిక సదుపాయాలను మాత్రమే మేము అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యం చేసుకున్నాము అని ప్రకటన విడుదల చేయడం గమనార్హం. పాకిస్తాన్ చేసే ప్రకటనల్లో నిజమెంతో ఆపరేషన్ సింధూర్ విషయంలో చూసాం. బలూచ్ వీరుల దాడుల సమయంలో గమనించాం. అందువల్ల పాక్ ప్రకటనను పెద్దగా నిజమని నమ్మాల్సిన అవసరం లేదు.
పిరికిపంద చర్య : తీవ్రంగా తప్పుపట్టిన భారత్
న్యూదిల్లీ : అఫ్గానిస్థాన్‌లోని కాబుల్ హాస్పిటల్‌పై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఇది పిరికిపంద, అమానుష చర్య అంటూ మండిపడింది. రంజాన్ వేళ ఇలాంటి దాడులకు పాల్పడటం దారుణమని విచారం వ్యక్తంచేసింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ప్రకటనను విడుదల చేసింది. పాక్ ది అత్యంత పిరికిపంద, అమానవీయ చర్య. ఈ దారుణమైన మారణహోమాన్ని ఒక సైనిక ఆపరేషన్‌గా కప్పిపుచ్చుకునేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తోంది. ఇది అఫ్గానిస్థాన్ సార్వభౌమాధికారంపై జరిగిన దాడి. ఈ హేయమైన, నిర్లక్ష్యపూరిత చర్య ప్రాంతీయ శాంతి భద్రతలకు ప్రత్యక్ష ముప్పు. సరిహద్దుల ఆవల ఇలాంటి తీవ్రమైన హింసాత్మక చర్యలతో.. తమ అంతర్గత వైఫల్యాలను పాక్ ఇతరులపై నెట్టాలని చూస్తోంది. పవిత్ర రంజాన్ మాసంలో ఈ దాడికి పాల్పడటం మరింత దారుణం. ఈ నేరపూరిత చర్యకు పాల్పడిన వారిని అంతర్జాతీయ సమాజం జవాబుదారీగా చేయాలి. పాకిస్తాన్ ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దాడులను తక్షణమే అడ్డుకోవాలని భారత విదేశాంగ శాఖ ప్రకటనలో పేర్కొంది. అఫ్గానిస్థాన్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతకు భారత్ ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుందని విదేశాంగ శాఖ తెలిపింది. ఈ విపత్కర సమంలో ఆ దేశ ప్రజలకు అండగా ఉంటామని హా ఇచ్చింది. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




