పర్వత సరిహద్దుల్లో మళ్లీ మిన్నంటుతున్న ఉద్రిక్తత

యుద్ధ మేఘాల నీడలో పాకిస్థాన్–ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలు
రామ కిష్టయ్య సంగన భట్ల, 
సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కాలమిస్ట్… 9440595494

పాకిస్థాన్–ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు మరోసారి రగులుతోంది. పర్వత శ్రేణులు, లోయలు, తెగల నివాస ప్రాంతాలు, చారిత్రక మార్గాలు కలసి ఉన్న ఈ భూభాగం శతాబ్దాలుగా సంఘర్షణలకు వేదికైంది. నేటి ఉద్రిక్తత ఒక్కరోజులో పుట్టినది కాదు; ఇది చరిత్రలో నాటుకుపోయిన అనుమానాల, భద్రతా ఆందోళనల, రాజకీయ వ్యూహాల సమాహారం. 2021లో తాలిబన్ కాబూల్‌లో అధికారాన్ని స్వీకరించిన తరువాత స్థిరత్వం ఏర్పడుతుందని ఆశించిన పాకిస్తాన్  పాలకవర్గాలు, విరుద్ధంగా మరింత సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. సరిహద్దు చెక్‌చౌకీలు, సైనిక స్థావరాలు, గ్రామాలు లక్ష్యంగా దాడులు జరుగుతుండటం రెండు దేశాల మధ్య అవిశ్వాసాన్ని పెంచుతోంది. ఈ సంక్షో భానికి  మూలం 1893లో బ్రిటిషు పాలన కాలంలో నిర్ణయించిన డ్యూరాండ్ రేఖ. అప్పటి బ్రిటిషు భారతదేశ విదేశాంగ కార్యదర్శి సర్ మార్టిమర్ డ్యూరాండ్ మరియు ఆఫ్ఘన్ అమీరైన అబ్దుల్ రహమాన్ ఖాన్ మధ్య కుదిరిన ఒప్పందంతో సుమారు 2,640 కిలోమీటర్ల పొడవైన ఈ రేఖ నిర్ణయించ బడింది. ఈ రేఖ పశ్తూన్ తెగల భూభాగాన్ని రెండుగా చీల్చింది. పాకిస్థాన్ దానిని అంతర్జాతీయ సరిహద్దుగా పరిగణిస్తుండగా, ఆఫ్ఘనిస్తాన్  చారిత్రకంగా దానిని పూర్తిగా అంగీకరించలేదు. ఈ విభేదం రెండు దేశాల సంబంధాల్లో నిరంతర ఉద్రిక్తతకు మూలాధారంగా నిలిచింది.

సోవియట్ దళాలు 1979లో ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రవేశించినప్పటి నుంచి ఆ ప్రాంతం నిరంతర యుద్ధ వాతావరణాన్ని అనుభవిస్తోంది. 1989లో సోవియట్ ఉపసంహరణ, ఆ తరువాతి గృహ పోరాటాలు, 1996లో తాలిబాన్ తొలి పాలన, 2001లో అమెరికా నేతృత్వంలోని దళాల జోక్యం, 2021లో విదేశీ దళాల నిష్క్రమణ ఈ పరిణామాలన్నీ సరిహద్దు ప్రాంతాన్ని అస్థిరతలోకి నెట్టాయి. అమెరికా వెళ్లిపోయిన తర్వాత ఏర్పడిన శూన్యతను పలు మిలిటెంట్ వర్గాలు వినియోగించు కున్నాయని ఇస్లామాబాద్ భావిస్తోంది. ముఖ్యంగా పాకిస్థాన్‌కు సవాలుగా ఎదిగింది. తెహ్రిక్ ఇ పాకిస్తాన్ (టిటిపి). 2007లో ఏర్పడిన ఈ సంస్థ పాకిస్థాన్‌లో ఇస్లామీయ విధానాన్ని అమలు చేయాలని లక్ష్యంగా ప్రకటించి, సైనికులు, పోలీసు సిబ్బంది, పౌరులపై అనేక దాడులు చేసింది. అధికార అంచనాల ప్రకారం గత దశాబ్దన్నర కాలంలో వేలాది ప్రాణనష్టం సంభవించింది. ఇటీవలి సంవత్సరాల్లో దాడుల తీవ్రత మరింత పెరిగినట్లు నివేదికలు సూచిస్తున్నాయి.
ఇస్లామాబాద్ ఆరోపణ ఏమిటంటే టిటిపి నాయకత్వం ఆఫ్ఘన్ భూభాగంలో ఆశ్రయం పొందుతోంది. కాబూల్ ఈ ఆరోపణలను ఖండిస్తూ తమ భూభాగాన్ని ఇతర దేశాలపై దాడులకు ఉపయోగించ నివ్వబోమని ప్రకటిస్తోంది. అయినప్పటికీ ఖైబర్ పఖ్తూన్ ఖ్వా, ఉత్తర వజిరిస్తాన్, బలోచిస్తాన్ ప్రాంతాల్లో తరచూ జరిగే దాడులు పాకిస్థాన్‌లో ఆందోళన కలిగిస్తున్నాయి. రాత్రివేళల్లో సైనిక స్థావరాలపై ఆకస్మిక దాడులు చేసి, పర్వత మార్గాల్లోకి వెనుదిరిగే వ్యూహం అమలు చేస్తున్నారని పాకిస్థాన్ సైన్యం పేర్కొంటోంది. ప్రతిగా దళాలు గాలింపు చర్యలు చేపడు తున్నాయి. సరిహద్దు భద్రతను బలోపేతం చేసేందుకు పాకిస్థాన్ విస్తృత కంచె నిర్మాణాన్ని చేపట్టింది. ఎక్కువ భాగంలో కంచె పూర్తయిందని ప్రకటించినప్పటికీ, పర్వత ప్రాంతాల కఠిన భౌగోళిక స్వభావం కారణంగా చొరబాట్లు పూర్తిగా ఆగలేదు. ఈ కంచె నిర్మాణాన్ని తాలిబాన్ పలు సందర్భాల్లో వ్యతిరేకించింది. కొన్నిచోట్ల నిర్మాణ పనులను అడ్డుకునే ప్రయత్నాలు కూడా జరిగాయి.
ఈ ఉద్రిక్తతలకు భౌగోళిక–రాజకీయ పరిమాణం ఉంది. చైనా సహకారంతో అమలవుతున్న చైనా–పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ ప్రాజెక్టు భద్రతపై పాకిస్థాన్ అప్రమత్తంగా ఉంది. బలోచిస్తాన్‌లో వేర్పాటువాద హింస కొనసాగుతుండగా పశ్చిమ సరిహద్దు అస్థిరత అదనపు భారంగా మారింది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. విదేశీ నిధుల కొరత, నిరుద్యోగం, సామాజిక అసంతృప్తి ఇవి దేశాన్ని ఒత్తిడికి గురిచేస్తున్నాయి. సరిహద్దు ఘర్షణలు ఈ రెండు దేశాల ఆర్థిక పరిస్థితిని మరింత దెబ్బతీస్తున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో నివసించే తెగల సామాజిక జీవితం ఈ రేఖతో విభజించ బడింది. కుటుంబ బంధాలు, సంప్రదాయ వాణిజ్య మార్గాలు, సాంస్కృతిక అనుబంధాలు విభజనకు గురయ్యాయి. తరచూ సరిహద్దు మూసివేతలు జరిగితే చిన్న వ్యాపారులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. పాకిస్థాన్–ఆఫ్ఘన్ వాణిజ్యం గతంలో గణనీయ స్థాయిలో ఉన్నప్పటికీ, భద్రతా పరిమితులు వాణిజ్య ప్రవాహాన్ని తగ్గిస్తున్నాయి.
అంతర్జాతీయ సమాజం ఈ పరిణామాలను ఆందోళనగా గమనిస్తోంది. ఐక్యరాజ్య సమితి పలు నివేదికల్లో ఆఫ్ఘన్ భూభాగంలో వివిధ మిలిటెంట్ వర్గాల ఉనికి ఉందని పేర్కొంది. అయితే వాటి ప్రభావం, సంఖ్యలపై భిన్న అంచనాలు వినిపిస్తున్నాయి. విదేశీ దళాల ఉపసంహరణ తర్వాత ఏర్పడిన శక్తి సమీకరణాలు ఇంకా స్థిరపడలేదు.
రాజకీయ అవిశ్వాసం ఈ సమస్యను మరింత సంక్లిష్టం చేస్తోంది. గతంలో తాలిబాన్‌కు పాకిస్థాన్ మద్దతు ఇచ్చిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు అదే తాలిబాన్ పాలనలో టిటిపి సమస్య పెరగడం వ్యూహాత్మక విరోధాభాసంగా మారింది. ఆఫ్ఘన్ తాలిబాన్ అంతర్గతంగా విభిన్న వర్గాలతో కూడి ఉన్నదన్న విశ్లేషణలు ఉన్నాయి. నిర్ణయాలలో ఏకీభావం లోపిస్తే సరిహద్దు నిర్వహణ కష్టతరం అవుతుంది.
పాకిస్థాన్ అంతర్గత రాజకీయ అస్థిరత, ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభం—ఇవి భద్రతా చర్యలపై ప్రభావం చూపుతున్నాయి. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ అంతర్జాతీయ గుర్తింపును పొందేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో సరిహద్దు ఉద్రిక్తతలు దౌత్య సంబంధాలను మరింత కఠినతరం చేస్తున్నాయి. సమస్యకు పరిష్కారం కోసం పరస్పర చర్చలు, గూఢసమాచార వ్యవస్థలు, సరిహద్దు నిర్వహణలో సమన్వయం అవసరం. తెగల పెద్దలు, స్థానిక నాయకులను చర్చల్లో భాగస్వామ్యం చేయడం ద్వారా సామాజిక స్థాయిలో నమ్మకం పెంపొందించాలి. మొత్తంగా పాకిస్థాన్–ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు సమస్య కేవలం భూభాగ వివాదం కాదు. ఇది చరిత్ర, తెగల గుర్తింపు, మత రాజకీయాలు, భౌగోళిక ప్రయోజనాలు, ఉగ్రవాద వ్యూహాలు అన్నింటి కలబోత. సైనిక స్థావరాలపై దాడులు ఉపరితల లక్షణాలే కాని లోతులో ఉన్న అవిశ్వాసానికి ప్రతిబింబం. యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న ఈ దశలో శాంతి మార్గమే ప్రజలకు భద్రమైన భవిష్యత్తును అందించగలదు. లేదంటే ఈ పర్వత సరిహద్దు మరోసారి దీర్ఘకాలిక ఘర్షణలకు వేదిక కావడం అనివార్యం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *