– ఆరోగ్య సమస్యలు కూడా వేధిస్తున్నాయి
– మొగులయ్య వేదన విని అండగా ఉంటానన్న కేటీఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 18 : ఇంటి స్థల సమస్య, ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్యకు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. కేటీఆర్‌ను మొగులయ్య శనివారం కలిసి తన సమస్యను వివరించారు. ఈ సందర్భంగా మొగులయ్య ఆరోగ్యం, యోగక్షేమాల గురించి కేటీఆర్ ఆరా తీశారు. తనకు చూపు మందగించిందంటూ చికిత్స కోసం ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన కేటీఆర్ ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్‌లో పూర్తి చికిత్సను అందించే బాధ్యతను తాను తీసుకుంటానని మొగులయ్యకు హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం తనకు హయత్‌నగర్ మండలంలో కేటాయించిన 600 గజాల స్థలం విషయంలో కొంతమంది వ్యక్తుల నుంచి ఎదురవుతున్న ఇబ్బందులు, కోర్టు కేసుల వివరాలను కేటీఆర్‌కు వివరించారు. తాను కట్టుకున్న గోడలను, ఇంటిని కూలగొట్టారని, కోర్టులో కేసులు వేసి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన స్థలాన్ని కాపాడాలని కేటీఆర్‌ను కోరారు. అనేకసార్లు కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ తనకు పరిష్కారం దొరకలేదని, తనకు అండగా నిలవాలని కోరారు. దీంతో కేటీఆర్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి ఫోన్ చేసి మాట్లాడి సమస్యను వెంటనే పరిష్కరించి మొగులయ్యకు న్యాయం చేయాలని కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




