రికార్డుస్థాయిలో ధాన్యం సేకరణకు సిద్ధం

– కేంద్రం అన్ని రకాలుగా మద్దతు ఇవ్వాలి
– పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 30: ఈ ఖరీఫ్‌లో రాష్ట్రం అత్యధికంగా ధాన్యం సేకరణకు సిద్ధమవుతోందని, సేకరణ లక్ష్యాలను, డెలివరీ నిబంధనలు అత్యవసరంగా సవరించాలని, అదనపు నిల్వ, రవాణా సౌకర్యాలను కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ ఖరీఫ్‌లో దాదాపు 80 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించాలనేది లక్ష్యమని, తెలంగాణ చరిత్రలో ఇప్పటివరకు లేదని, దేశంలోని ఏ రాష్ట్రంలో లేనంత అత్యధికమని, గత ఏడాది రికార్డు 67 లక్షల మెట్రిక్‌ టన్నులు అని వివరించారు. 45%-50%ఎల్‌ఎంటీలు సన్న రకం వరి, 30-35%ఎల్‌ఎంటీలు ముతక ధాన్యం సేకరించనున్నామన్నారు. క్వింటాలు ధాన్యానికి రూ.2,389 కనీస మద్దతు ధర (రూ.2,400 వరకు) నిర్ణయించిన తర్వాత 80 లక్షల మెట్రిక్‌ టన్నుల సేకరణకు దాదాపు రూ.20వేల కోట్లు వ్యయం అవుతుందని, బోనస్‌ చెల్లింపులు, రవాణా ఖర్చులతో రూ.24,000 నుంచి రూ.26,000 కోట్ల మధ్య పెరుగుతుందని వివరించారు. కస్టమ్డ్‌ మిల్‌ రైస్‌ (కేఎంఎస్‌) 2024-25 కోసం డెలివరీ గడువును నవంబర్‌ 12 వరకు పొడిగిస్తూ పారా బాయిల్డ్‌ రైస్‌గా మాత్రమే సరఫరాను తప్పనిసరి చేస్తూ జారీ చేసిన ఉత్తర్వుపై ఉత్తమ్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ముడి బియ్యం మార్పిడికి ఖరీఫ్‌ వరి మరింత అనుకూలంగా ఉంటుందని, అందుబాటులో ఉన్న స్టాక్‌లో 7.80 లక్షల మెట్రిక్‌ టన్నులు ముడి బియ్యం మిల్లర్ల వద్ద ఉన్నట్లు తెలిపారు. అయితే 1.67 ఎల్‌ఎంటీల వరి (1.13 ఎల్‌ఎంటీల బియ్యానికి సమానం) బాయిల్డ్‌ రైస్‌ మిల్లర్ల వద్ద ఉంది. లభ్యతనుబట్టి ముడి, బాయిల్డ్‌ రైస్‌ రెండిరటినీ డెలివరీ చేయడానికి అనుమతివ్వాలని, బాయిల్డ్‌ రైస్‌ లక్ష్యాన్ని రబీ సీజన్‌కు మార్చాలని కేంద్రాన్ని అభ్యర్థిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. సెప్టెంబర్‌ చివరి నాటికి ఖరీఫ్‌ 2024-25 నుండి 5.44 ఎల్‌ఎంటీల సీఎంఆర్‌, రబీ 2024-25 నుండి 14.92 ఎల్‌ఎంటీల సీఎంఆర్‌ పంపిణీ చేయలేదన్నారు. ఫలితంగా మిల్లర్లు కార్యకలాపాలను నిలిపివేయగా పనిలేక కార్మికులు రైస్‌ మిల్లులను వదిలి వెళ్ళాల్సి వచ్చిందన్నారు. రాష్ట్రంలోని 22.61 ఎల్‌ఎంటీల మొత్తం ఎఫ్‌సీఐ నిల్వ సామర్థ్యంలో, 21.72 ఎల్‌ఎంటీలు ఇప్పటికే నిండి ఉన్నాయని, కేవలం 0.89 ఎల్‌ఎంటీలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలోని ఎఫ్‌సీఐ గోడౌన్లు నిండినందున వాటిని ఖాళీ చేయడానికి నెలకు కనీసం 300 ప్రత్యేక రేక్‌లను ఇవ్వాలని, తద్వారా తదుపరి పంటను సౌకర్యవంతంగా ఉంచుకోవచ్చునని సూచించారు. అదనపు నిల్వ స్థలాన్ని లీజుకు ఇవ్వమని తాము ఎప్‌సీఐని కోరామన్నారు. అలాగే కేఎంఎస్‌ 2025-26 కోసం తెలంగాణ సేకరణ లక్ష్యాన్ని పెంచాలని ఉత్తమ్‌ కోరారు. లక్ష్యం 80 లక్షల మెట్రిక్‌ టన్నుల వరికి సమానమైన 53.60 లక్షల మెట్రిక్‌ టన్నులు సేకరించాలని, లేకుంటే లక్షలాదిమంది రైతులు ధాన్యం అమ్మకాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలిపారు. ఇప్పటికే సేకరించిన గత రబీ పంట నుండి మరో 10 లక్షల మెట్రిక్‌ టన్నులు తీసుకోవాలని, సేకరణ గడువును అక్టోబర్‌ 31 నుండి జనవరి 31, 2026 వరకు పొడిగించాలని ఉత్తవమ్‌ కోరారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *