– వలస కార్మికుల హక్కుల రక్షణకు కృషి చేయాలి
– ఎంపీ డీకే అరుణకు విజ్ఞప్తి
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 4: దేశం నుంచి విదేశాలకు వెళ్లే లక్షలాదిమంది వలస కార్మికుల జీవితాలను ప్రభావితం చేసే ఓవర్సీస్ మొబిలిటీ(విదేశీ వలస) బిల్లుపై పార్లమెంటులో ప్రస్తావించాలని తెలంగాణ అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, మెంబర్ చెన్నమనేని శ్రీనివాసరావులు గురువారం దిల్లీలో మహబూబ్‌నగర్ ఎంపీ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండిరగ్ కమిటీ సభ్యురాలు డి.కె.అరుణకు వినతిపత్రం సమర్పించారు. 42 ఏళ్లుగా అమలులో ఉన్న ఎమిగ్రేషన్ యాక్ట్-1983 స్థానంలో భారత ప్రభుత్వం కొత్త చట్టం చేసే యోచనలో ఉన్నది. 2021 ముసాయిదాలో ప్రవాసీ కార్మికులకు ప్రతిపాదించిన అనేక రక్షణలు కొత్త బిల్లులో లేవు. అధికారాలు కేంద్రీకృతమవడం ద్వారా దోపిడీ ప్రమాదం పెరుగుతోందని పౌరసమాజ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రతిపాదిత ఓవర్సీస్ మొబిలిటీ అండ్ వెల్ఫేర్ కౌన్సిల్‌లో వలస కార్మికులను విదేశాలకు పంపే రాష్ట్రాలు, కార్మిక సంఘాలు, హక్కుల సంస్థలకు ప్రాతినిధ్యం లేదు. రాష్ట్రస్థాయి నోడల్ కమిటీలు తొలగింపు వల్ల స్థానిక సమస్యల పరిష్కారానికి ఆటంకం. ఎమిగ్రేషన్ చెక్‌పోస్టులు రద్దయినప్పటికీ ప్రత్యామ్నాయ నియంత్రణ వ్యవస్థ లేదు. ప్రయాణానికి ముందు శిక్షణ, విదేశాల్లో సహాయక సేవల ప్రమాణాలు స్పష్టంగా లేవు. ఇంటిగ్రేటెడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ హక్కుల కంటే పర్యవేక్షణపైనే దృష్టి. 24/7 హెల్ప్ లైన్‌లు, విమానాశ్రయ-ఎంబసీ సహాయం తప్పనిసరి కాదని ముసాయిదా చెబుతోంది. శిక్షలు కేవలం రిక్రూట్‌మెంట్ ఏజెంట్లపైనే విదేశీ యాజమాన్యాలపై చర్యలు లేవు. ట్రాఫికింగ్ (అక్రమ రవాణా), చట్ట విరుద్ధ ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్‌పై ప్రత్యేక నిబంధనలు లేకపోవడం, విధించే జరిమానాల్లో బాధితులకు పరిహారం కేటాయింపు లేదు. వలస కార్మికుల హక్కులు కాపాడాలని వారు కోరారు. భారతీయ వలస కార్మికులు విదేశాల్లో గౌరవంగా, భద్రతతో పనిచేసేందుకు ప్రభుత్వం కింది చర్యలు తీసుకోవాలన్నారు.
1. రిక్రూట్‌మెంట్, వేతనాలు, సామాజిక రక్షణపై అమలు చేయగల హక్కులను పునరుద్ధరించాలి.
2. రాష్ట్రాలు, పౌర సమాజానికి ప్రాతినిధ్యం కలిగిన వికేంద్రీకృత పాలనా వ్యవస్థ ఏర్పాటు చేయాలి.
3. సులభమైన ఫిర్యాదు వ్యవస్థలు, బలమైన సహాయక సేవలు తప్పనిసరి చేయాలి.
4. మానవ అక్రమ రవాణా నిరోధానికి కఠిన చర్యలు, హామీ గల పరిహారం నిబంధనలు చేర్చాలి.
5. అన్ని వలస వర్గాలను కవర్ చేసేలా నిర్వచనాలను విస్తరించాలి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



