అవరోధాలు దాటి… ఆత్మవిశ్వాసంతో ముందుకు

జనక మోహన రావు దుంగ
8247045230

సమాజంలో ప్రతి వ్యక్తీ గౌరవంగా జీవించే హక్కును కలిగి ఉంటారు. అయితే శారీరకంగా లేదా మానసికంగా కొన్ని సవాళ్లను ఎదుర్కొంటున్న వారిని మనం గతంలో ‘వికలాంగులు’ అని పిలిచేవాళ్ళం. కానీ వారిలో దాగి ఉన్న అంతర్గత శక్తిని, ప్రత్యేక ప్రతిభను గుర్తించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారిని ‘దివ్యాంగులు’ అని సంబోధించడం ఒక సామాజిక మార్పుకు నాంది పలికింది. దివ్యాంగులు అంటే కేవలం కాళ్లు, చేతులు లేనివారు మాత్రమే కాదు, దృష్టి లోపం, వినికిడి లోపం, మానసిక వైకల్యం, చలన సంబంధిత సమస్యలు ఉన్నవారందరూ ఈ కోవలోకి వస్తారు. 1995 నాటి చట్టం ప్రకారం కేవలం ఏడు రకాల వైకల్యాలను మాత్రమే గుర్తించగా, 2016లో వచ్చిన నూతన చట్టం ప్రకారం 21 రకాల వైకల్యాలను భారత ప్రభుత్వం గుర్తించింది. ఇందులో ఆసిడ్ దాడి బాధితులు, పార్కిన్సన్స్ వ్యాధిగ్రస్తులు కూడా చేర్చారు.

భారతదేశంలో దివ్యాంగుల జనాభా గణాంకాలను పరిశీలిస్తే, 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో దాదాపు 2.68 కోట్ల మంది దివ్యాంగులు ఉన్నారు. ఇది దేశ మొత్తం జనాభాలో సుమారు 2.21 శాతంగా ఉంది. ఇందులో స్త్రీ, పురుషుల నిష్పత్తిని గమనిస్తే, మొత్తం దివ్యాంగులలో పురుషులు 56 శాతంగా ఉండగా, స్త్రీలు 44 శాతంగా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనే అత్యధిక శాతం దివ్యాంగులు నివసిస్తున్నారు. ఇక అక్షరాస్యత విషయానికి వస్తే, జాతీయ సగటుతో పోల్చితే వీరిలో అక్షరాస్యత తక్కువగానే నమోదైంది. 2011 గణాంకాల ప్రకారం దివ్యాంగులలో మొత్తం అక్షరాస్యత 55 శాతంగా మాత్రమే ఉంది. ఉద్యోగ రంగంలో వీరి ప్రాతినిధ్యం చాలా ఆందోళనకరంగా ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఉపాధి పొందుతున్న వారి సంఖ్య చాలా తక్కువ. సుమారు 64 శాతం మంది దివ్యాంగులు నిరుద్యోగులుగా లేదా ఎటువంటి ఉత్పాదక పనుల్లో పాల్గొనలేని వారిగా మిగిలిపోతున్నారని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలలో వీరికి రిజర్వేషన్లు ఉన్నప్పటికీ, అనేక బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ కాకుండా మిగిలిపోవడం విచారకరం.
ప్రత్యేక రక్షణ:
భారత రాజ్యాంగం దివ్యాంగులకు ప్రత్యేక రక్షణ కల్పిస్తోంది. రాజ్యాంగంలోని అధికరణ 14 అందరికీ సమానత్వాన్ని ప్రసాదిస్తుండగా, అధికరణ 15 వివక్షను నిషేధిస్తుంది. ముఖ్యంగా అధికరణ 41 ప్రకారం, నిరుద్యోగం, వృద్ధాప్యం, అనారోగ్యం లేదా వైకల్యం ఉన్న సందర్భాలలో ప్రజలకు పని హక్కు, విద్యా హక్కు, ప్రభుత్వ సహాయం పొందే హక్కును కల్పించాలని రాజ్యాంగం రాజ్యానికి నిర్దేశించింది. ఈ రాజ్యాంగ స్ఫూర్తితోనే కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మకమైన “దివ్యాంగుల హక్కుల చట్టం – 2016″ను తీసుకువచ్చింది. ఈ చట్టం ప్రభుత్వ ఉద్యోగాలలో దివ్యాంగుల రిజర్వేషన్లను 3 శాతం నుండి 4 శాతానికి పెంచడమే కాకుండా, ఉన్నత విద్యా సంస్థల్లో 5 శాతం సీట్లను కేటాయించింది. ఎవరైనా దివ్యాంగులను అవమానిస్తే లేదా వారి పట్ల వివక్ష చూపితే కఠిన శిక్షలు విధించే వెసులుబాటును కూడా ఈ చట్టం కల్పించింది.
సంక్షేమ పథకాలు:
కేంద్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం అనేక ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తోంది. అందులో అత్యంత ప్రధానమైనది “సుగమ్య భారత్ అభియాన్”. ప్రభుత్వ కార్యాలయాలు, రవాణా వ్యవస్థలు, వెబ్‌సైట్లు అన్నీ దివ్యాంగులకు సులభంగా అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దడమే దీని ముఖ్య ఉద్దేశం. అలాగే దివ్యాంగులకు సహాయక పరికరాలు అంటే వీల్ చైర్స్, వినికిడి యంత్రాలు, కృత్రిమ అవయవాలు లాంటివి ఉచితంగా పంపిణీ చేయడానికి ‘ఎడిప్’ పథకం అమలులో ఉంది. దేశవ్యాప్తంగా దివ్యాంగులు ఏ రాష్ట్రానికి వెళ్ళినా వారి ధ్రువీకరణ చెల్లుబాటు అయ్యేలా ‘యూడీఐడీ’ కార్డుల జారీ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతంఈ చేసింది. దీనివల్ల వారు సంక్షేమ పథకాలను దేశంలో ఎక్కడైనా పొందే అవకాశం కలుగుతుంది. ఇవే కాకుండా నేషనల్ ఫెలోషిప్స్ ద్వారా ఉన్నత విద్యను అభ్యసించే దివ్యాంగ విద్యార్థులకు ఆర్థిక సహాయంఈ కూడా అందుతోంది.
వివక్షను పారద్రోలాలి:
ఎన్ని చట్టాలు, పథకాలు ఉన్నప్పటికీ, సమాజంలో దివ్యాంగులు నేటికీ తీవ్ర వివక్షను ఎదుర్కొంటున్నారు. ఈ వివక్ష ప్రధానంగా మూడు రంగాలలో కనిపిస్తుంది. మొదటిది సామాజిక వివక్ష. ఇప్పటికీ మన సమాజంలో వైకల్యాన్ని పూర్వజన్మ పాపంగానో లేదా ఒక శాపంగానో చూసే ధోరణి గ్రామీణ ప్రాంతాల్లో ఉంది. వారిని శుభకార్యాలకు దూరంగా ఉంచడం, వారి సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయడం జరుగుతోంది. రెండవది నిర్మాణాత్మక వివక్ష. నేటికీ అనేక ప్రైవేటు సంస్థలు, ప్రైవేటు పాఠశాలలు, ఏటీఎంలు, బస్సుల్లో ర్యాంపులు లేకపోవడం వల్ల వారు ఇతరుల సహాయం లేకుండా కదలలేని పరిస్థితి ఉంది. మూడవది విద్యా, ఉద్యోగ వివక్ష. ప్రధానంగా ప్రభుత్వేతర పాఠశాలల్లో దివ్యాంగ పిల్లలను చేర్చుకోవడానికి యాజమాన్యాలు వెనుకాడుతున్నాయి. అలాగే  ఉద్యోగాలలో వారు పని చేయలేరేమో అనే అపోహతో అర్హత ఉన్నప్పటికీ అవకాశాలు నిరాకరిస్తున్నారు.
సామాజిక స్పృహ అవసరం:
ఈ సమస్యలను అధిగమించడానికి కేవలం ప్రభుత్వ కృషి మాత్రమే సరిపోదు, సామాజిక దృక్పథంలో మార్పు రావాలి. ముందుగా ‘చేతకాదు’ అనే భావన నుండి ‘చేయగలరు’ అనే నమ్మకాన్ని వారిలో, సమాజంలో కలిగించాలి. ప్రభుత్వ భవనాలు, పార్కులు, సినిమా హాళ్లు, రవాణా వ్యవస్థలను పూర్తిగా దివ్యాంగులకు అనుకూలంగా మార్చాలి. సమ్మిళిత విద్య ద్వారా సాధారణ పిల్లలతో పాటే దివ్యాంగ పిల్లలు చదువుకునేలా ప్రోత్సహించాలి. దీనివల్ల చిన్నప్పటి నుండే పిల్లల్లో సమానత్వ భావన పెరుగుతుంది. ప్రైవేటు రంగంలో కూడా దివ్యాంగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే సంస్థలకు పన్ను రాయితీలు ఇవ్వడం ద్వారా ప్రోత్సహించవచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా, వైకల్యం అనేది శరీరానికి సంబంధించినదే తప్ప, మనసుకు లేదా ప్రతిభకు కాదనే సత్యాన్ని ప్రతి పౌరుడు గ్రహించాలి. అప్పుడే మనం నిజమైన అర్థంలో ప్రగతిశీల సమాజంగా ఎదుగుతాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *