– డ్రగ్స్ రహిత తెలంగాణే లక్ష్యం
– కానిస్టేబుల్ సౌమ్య బలిదానం వృథా పోనివ్వం
– ఎక్సైజ్ అధికారుల డైరీ ఆవిష్కరణలో మంత్రి జూపల్లి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20: తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రూపొందించిన డైరీ, క్యాలెండర్లను రవీంద్రభారతిలో ఆయన శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డ్రగ్స్ వల్ల కలిగే సామాజిక అనర్థాలపై ఆందోళన వ్యక్తం చేశారు. మత్తు కోరల్లో చిక్కి ఎంతోమంది యువత భవిష్యత్తు నాశనమవుతోంది.. ఎన్నో కుటుంబాలు చితికిపోతున్నాయి.. తలిదండ్రుల ఆశలు అడియాశలవుతున్నాయి అంటూ ఇలాంటి అరాచక శక్తులను సమాజం నుంచి ఏరిపారేయాలన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలను పణంగా పెట్టి గంజాయి ముఠాను అడ్డుకునే క్రమంలో కానిస్టేబుల్ సౌమ్య మృతిచెందడం దురదృష్టకరమంటూ ఆమె కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రూ.కోటి ఆర్థిక సహాయాన్ని అందించిందని గుర్తు చేశారు. స్మగ్లర్ల ఆగడాలను అరికట్టడంతోపాటు అధికారుల ఆత్మరక్షణ కోసం ఎక్సైజ్ శాఖకు ఆయుధాలిచ్చే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని, వారికి శిక్షణ ఇచ్చి ఆయుధాలను అప్పగిస్తామని జూపల్లి ప్రకటించారు. అక్రమ మద్యం నియంత్రణ, మాదక ద్రవ్యాల నిర్మూలనకు అంకితభావంతో పనిచేస్తున్న అధికారులను అభినందించారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల కట్టడికి అధికారులు తమ శక్తివంచన లేకుండా కృషి చేయాలని, ఈ పోరాటంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ అధికారుల వెంటే ఉంటుందని, అవసరమైన వనరులు కల్పిస్తుందని భరోసా ఇచ్చారు. అధికారులు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని, తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పారు. కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ అదనపు కమిషనర్ సయ్యద్ యాసిన్ ఖురేషీ, ఎక్సైజ్ అకాడమీ డైరెక్టర్ సురేష్ రాథోడ్, జాయింట్ కమిషనర్ (ఎన్‌ఫోర్సుమెంట్) జి.అంజన్ రావు, డిప్యూటీ కమిషనర్ జె.హరికిషన్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సూర కృష్ణ, జనరల్ సెక్రటరీ చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





